పండించిన రైతన్నను కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి.. ఒక్కసారిగా పడిపోయిన ధరలు!
Category : |
Sub Category : తాజా వార్తలు Posted on 2024-02-06 10:45:03
TWM News :- ఉల్లి ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గిపోయాయి. కనీసం రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఉల్లి పంటను అత్యధికంగా పండించేది కర్నూలు జిల్లా రైతులే. కర్నూలు జిల్లాలోని గూడూరు బెలగల్ ఎమ్మిగనూరు గోనెగండ్ల నందవరం కల్లూరు నంద్యాల జిల్లాలోని డోన్ నియోజకవర్గంలో అత్యధికంగా పండిస్తారు. కాస్త అన్ సీజన్ అయినప్పటికీ ఉల్లి ధరలు పెరగాల్సింది పోయి, రోజు రోజుకు తగ్గుతున్నాయి. నవంబర్ నెల చివరి నుంచి డిసెంబర్ వరకు క్వింటాల్ ఉల్లి ధర 3,000 రూపాయల వరకు ఉండేది. అయితే కర్నూలు మార్కెట్లో క్వింటాల్ హై గ్రేడ్ ఉల్లి ధర కేవలం 1,200 రూపాయలు పలికింది. మధ్య రకం పంట ధర రూ. 500 నుంచి రూ. 800 వరకు పలుకుతోంది. దీంతో రవాణా ఖర్చులు సైతం రావడంలేదని రైతులు వాపోతున్నారు.
ఇతర దేశాలకు ఉల్లి ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వాస్తవంగా బంగ్లాదేశ్ సహా ఇతర దేశాలకు కర్నూలు, మహారాష్ట్ర ఉల్లి ఎగుమతి అయ్యేది. ప్రస్తుతం ఎగుమతులు రద్దు చేయడంతో మహారాష్ట్ర ఉల్లి.. కర్నూలు మార్కెట్‌ను ముంచెత్తుతోంది. కర్నూలు ఉల్లి కంటే మహారాష్ట్ర సరుకు కాస్త నాణ్యత ఎక్కువ అని వ్యాపారులు చెబుతుండటంతో కర్నూలు ఉల్లికి ధరల పతనం మొదలైంది. ఇంకా పడిపోతుందేమోనని భయం రైతులను వెంటాడుతోంది. ఎగుమతులను ప్రోత్సహించాలని లేనిపక్షంలో క్వింటాల్ ఉల్లి కి కనీస మద్దతు ధర రూ. 2,000 కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే దళారుల బెడద మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే దళారులు పంటని మార్కెట్‌కు రానీయకుండా పొలంలోనే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో అయితే కొన్నవెంటనే డబ్బులు రైతుకు చేతికి వస్తుంది. దళారుల దగ్గర అలా ఉండదు. కొనుగోలు చేసి అమ్మిన తర్వాత రైతుకు చెల్లిస్తారు. కొందరు దళారులు డబ్బులు ఎగవేస్తున్నారు. దీంతో రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని ఉల్లిరైతులు కోరుతున్నారు.