Category : | Sub Category : బ్రేకింగ్ న్యూస్ Posted on 2024-02-04 10:27:09
భారత ఆర్ధిక వ్యవస్థ ఈ దశాబ్దం చివరి వరకు అంటే 2024-2031 ఆర్ధిక సంవత్సరాల మధ్య ఏటా సగటున 6.7 శాతం మేర వృద్ధిని నమోదు చేయగలదని క్రిసిల్ తన తాజా నివేదికలో అంచనా వేసింది. కరోనాకు ముందు సగటు ఆర్ధిక వృద్ధి అయిన 6.6 శాతంతో పోల్చినా ఇది 0.1 శాతం ఎక్కువ కావడం విశేషం. ఈ ధోరణికి మూలధన వ్యయాలు కీలకంగా నిలవగలవని క్రిసిల్ అంటోంది.
మూలధన వ్యయాలే కీలకం..: ప్రైవేటు రంగం పెట్టుబడులు పెట్టడానికి సంకోచిస్తున్న తరుణంలో పెట్టుబడుల వ్యూహంతో ప్రభుత్వం ముందుకు వస్తుండడమే ఈ ఫలితాలకు కారణమని పేర్కొంది. రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు ఇవ్వడంతో పాటు మౌలిక వసతులపై భారీ మూలధన వ్యయాలను పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం మేర వృద్ధి నమోదవుతుందని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 6.4 శాతానికి పరిమితం కాగలదని క్రిసిల్ అంటోంది. ముఖ్యంగా పశ్చిమాసియాలోని ఉద్రిక్త వాతావరణం కాస్తా ఇంధన, రవాణా వ్యయాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో పరిశీలించాల్సి ఉంటుందని తెలిపింది.
ద్రవ్యోల్బణం పై అప్రమత్తత: కూరగాయలు, ఆహార ధాన్యాల ధరలు పెరగడంతో డిసెంబరు 2023లో ద్రవ్యోల్బణ స్థాయి 5,7 శాతంగా ఉంది. ఇది ఆర్బీఐ లక్ష్యమైన 4 శాతానికి ఎగువగా ఉన్న నేపథ్యంలో కేంద్ర బ్యాంకు మరింత అప్రమత్తంగా ఉండొచ్చని క్రిసిల్ అంటోంది ఒక వైపు టోకు ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు తగ్గుతూవస్తుండడం కొంత మేర ఆశలు రేకెత్తిస్తున్నా.. ఆహార ధరలు అధిక స్థాయుల్లో కొనసాగుతుండంతో సీపీ నేత్రి ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పడుతోందని వివరించింది.
ఈ ఏడాదిలో ఫెడరల్ రిజర్వ్ కీలక రేట్లను తగ్గించొచ్చని అంచనా. ఉద్యోగ గణాంకాలు, ద్రవ్యోల్బణం అంచనాలకు మించి నమోదు కావడంతో ఎప్పటి నుంచి ఈ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై అనుమానాలున్నాయి.