Category : | Sub Category : నేర Posted on 2024-02-04 10:22:15
ప్రశాంత విశాఖ నగరం మరోసారి ఉలిక్కిపడింది. విశాఖ గ్రామీణ తహసీల్దారుగా పనిచేసిన సనపల రమణయ్య (12) దారుణ హత్యకు గురయ్యారు. దీంతో.. ప్రజలను కాపాడాల్సిన అధికారులకే రక్షణ లేకపోతే ఎలా అని స్థానికులు వణికిపోతున్నారు. శుక్రవారం రాత్రి విశాఖ నగరం కొమ్మాదిలో రమణయ్యను ఆయన అపార్టుమెంట్ వద్దే దుండగుడు ఇనుప రాడ్తో విచక్షణారహితంగా కొట్టి అతి కిరాతకంగా హత్యచేయడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. రమణయ్య స్వస్థలం శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం దిమిలాడ, ఎన్నికల బదిలీల్లో భాగంగా ఇటీవలే విశాఖ గ్రామీణ పరిధిలోని చినగదిలి నుంచి విజయనగరం జిల్లా బొండపల్లికి బదిలీ అయ్యారు. శుక్రవారం బొండపల్లి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. తిరిగి విశాఖ నగరం కొమ్మాదిలోని చరణ్ కేజిల్ అపార్టుమెంటు 5వ అంతస్తులో ఉన్న తన నివాసానికి రాత్రి 8 గంటల ప్రాంతంలో చేరుకున్నారు.
ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేయడంతో 10 గంటల సమయంలో కిందికి వచ్చి వారిని కలిశారు. ఆ ఇద్దరు మాట్లాడి తిరిగి వెళుతుండగా... అప్పటివరకు గేటు వద్ద పొంచి ఉన్న నిందితుడు మాస్క్ ధరించి తహసీల్దారు వద్దకు వచ్చాడు. రమణయ్యతో మాట్లాడుతూనే అక్కడున్న సీసీ టీవీ కెమెరాలలో కనిపించకుండా ఉండేందుకు ఓ పిల్లర్ పక్కకు వెళ్లినట్లు రికార్డు అయింది. ఇద్దరి మధ్య పది నిమిషాలకు పైగా సంభాషణ జరిగింది. ఆఖర్లో వాగ్వాదం చోటుచేసుకుంది. అప్పటివరకు చేతులు కట్టుకుని వినయంగా మాట్లాడిన దుండగుడు ఒక్కసారిగా రాడ్తోవిరుచుకుపడ్డాడు. తలమీద కొట్టడంతో రమణయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కింద పడిపోయిన ఆయన తలపై ఐదుసార్లు బలంగా కొట్టిన దుండగుడు అక్కడి నుంచి జారుకున్నాడు. రక్తపు మడుగులో ఉన్న రమణయ్యను కాపలాదారు గుర్తించి అపార్టుమెంటు సెక్రటరీకి సమాచారమివ్వగా ఆరిలోవలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు..
వెంటిలేటర్పై అత్యవసర చికిత్స పొందుతూ తహసీల్దారు శనివారం తెల్లవారుజామున మృతిచెందారు. మృతుడికి భార్య అనూష, ఇద్దరు పిల్లలు ఉన్నారు. డయల్ 112కు సమాచారం రావడంతో రాత్రి 11:30 సమయంలో జాగ్స్క్వాడ్, క్లూస్టంలతో డీసీపీ-1 మణికంఠ, దిశ ఏసీపీ వివేకానంద ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీపీ రవిశంకర్, జేసీపీ ఫక్కీరప్ప ఘటనాస్థలి వద్ద, సీసీ టీవీ ఫుటేజిలను పరిశీలించారు. పీఎంపాలెం సీఐ రామకృష్ణ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. రమణయ్య గతంలో శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు, విశాఖ జిల్లా పద్మనాభం, కలెక్టరేట్, చినగదిలి రెవెన్యూ కార్యాలయాల్లో విధులు నిర్వహించారు.