Category : ఇతర | Sub Category : ఇతర వార్తలు Posted on 2024-10-17 15:12:45
TWM News:-గత కొన్ని రోజులుగా ఐటీ రంగంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతోన్న విషయం తెలిసిందే. పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగించాయి. ఆర్థికమాంద్యం పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో భారీగా ఉద్యోగాల కోతలు పెట్టాయి కంపెనీలు. అయితే ఐటీ రంగంలో ప్రస్తుతం మంచి రోజులు వస్తున్నాయని తెలుస్తోంది..
ఆర్థిక మాంద్యం పొంచి ఉందన్న వార్తలు మొన్నటి వరకు తీవ్ర ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే. చిన్న చిన్న స్టార్టప్స్ మొదలు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగించాయి. మరీ ముఖ్యంగా ఫ్రెషర్స్‌కు అసలు ఉద్యోగాలే రాని పరిస్థితి ఉంది. చివరికి ఐఐటీల్లో కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్‌లో విద్యార్థులు ఎంపిక కాకపోవడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఐటీ రంగానికి గడ్డు పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా ఐటీ రంగానికి మళ్లీ పూర్వ వైభవం వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
2024-25 ఏడాదికి సంబంధించి ఐటీ రంగంలో నియామకాలు 20 నుంచి 25 శాతం పెరుగుతాయని తాజాగా సర్వేలో వెల్లడైంది. టీమ్‌లీజ్ అనే కంపెనీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. టీమ్‌లీజ్ డిజిటల్ విశ్లేషన్ ప్రకారం.. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌లు గత సంవత్సరంతో పోలిస్తే వారి తాజా నియామకాలను 40 శాతం పెంచనున్నాయని తెలుస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML)తో పాటు డేటా అనలిటిక్స్ వంటి విభాగాలకు అవసరమయ్యే నైపుణ్యాలున్న వారికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని టీమ్‌లీజ్ అంచనా వేస్తోంది. 2024లో మెషిన్ లెర్నింగ్ విభాగంలో గణనీయమైన పెరుగుదల కనిపించినట్లు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను కంపెనీలు వేగంగా అలవరుచుకునే క్రమంలో ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే విధంగా పైథాన్ ప్రోగ్రామింగ్, ఎథికల్ హ్యాకింగ్, పెనెట్రేషన్ టెస్టింగ్, ఎజైల్ స్క్రమ్ మాస్టర్, AWS సెక్యూరిటీ, జావాస్క్రిప్ట్ వంటి నైపుణ్యాల అవసరం పెరుగుతోందని, ఇది నియామకాలపై ప్రభావం చూపుతుంది అంటున్నారు.
ఇదే విషయమై టీమ్‌లీజ్ డిజిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీతి శర్మ మాట్లాడుతూ.. “టెక్ పరిశ్రమ వేగంగా రూపాంతరం చెందుతూనే ఉంది. ఇందులో భాగంగా కంపెనీలు ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాలకు డిమాండ్ పెరుగుతోంది. నైపుణ్యం పెంచే ప్రోగ్రామ్‌లలో పెట్టుబడి పెట్టడం అనేది కేవలం ఒక ఎంపిక మాత్రమే కాదని, అవసరం’ అని చెప్పుకొచ్చారు.
ప్రాజెక్ట్ మేనేజర్‌లు, డేటా సైంటిస్టులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్ ఉన్నట్లు టీమ్‌లీజ్ అంచనా వేస్తోంది. వీరి జీతాలు కూడా 2023-24తో పోలిస్తే 7.89 శాతం నుంచి 10.2 శాతానికి పెరిగాయి. డేటా ఇంజనీరింగ్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, డెవాప్స్ వంటి రంగాల్లో పనిచేస్తున్న వారి జీతాలు 6.54 శాతం నుంచి 10.8 శాతం వరకు పెరిగింది. అలాగే క్లౌడ్ ఇంజనీరింగ్, డెవలప్‌మెంట్, ఆర్కిటెక్చర్‌కు సంబంధించిన నియమకాలు కూడా పెరిగాయి. ముఖ్యంగా 2025 నాటికి భారతదేశం వివిధ రంగాలలో క్లౌడ్ టెక్నాలజీలను ఉపయోగించనుంది. దీంతో రానున్న రోజుల్లో ఏకంగా 20 లక్షల మంది క్లౌడ్ నిపుణులు అవసరముంటారని భావిస్తున్నారు.