Category : | Sub Category : తాజా వార్తలు Posted on 2024-02-01 18:02:41
TWM Live News : గోదావరి ఎక్స్ ప్రెస్ రైలుకు అరుదైన గౌరవం దక్కింది. 1974 ఫిబ్రవరి 1 న ప్రారంభించబడి నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. విశాఖ – హైదరాబాద్ డెక్క న్ మధ్య ప్రజల భావోద్వేగాలను గత 50 ఏళ్లుగా మోస్తున్న గోదావరి ఎక్స్ ప్రెస్ సేవలను ప్రశంసిస్తూ ఈస్ట్ కోస్ట్ రైల్వే గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరిపి అందరి ఆనందాన్ని పంచుకుంది.
గోదావరి ఎక్స్‌ప్రెస్ కేవలం భారత దక్షిణ మధ్య రైల్వే లోని ఒక ప్రతిష్ఠాత్మక రైలు సర్వీస్ మాత్రమే కాదు. గతంలో ఉమ్మడి రాష్ట్రం లో ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా జిల్లాలను హైదరాబాద్ తో అనుసంధానం చేసిన రైళ్లు. ఆంధ్రా భావోద్వేగాలను తెలంగాణ కు తీసుకెళ్లే ట్రైన్ ఇది. ఈ రైలుని వాల్తేరు – హైదరాబాద్ మధ్య ఫిబ్రవరి 1, 1974 న తొలిసారిగా ప్రవేశ పెట్టారు. అప్పట్లో ఈ ట్రైన్ నెంబర్లు 7007, 7008 గా ఉండేవి. కాలక్రమం లో ఈ ట్రైన్ నెంబర్లు 12727, 12728 గా మారాయి. ఈ రైలుకు మొదట నుంచి విపరీతమైన ఆదరణ ఉంది.
ఈ ట్రైన్ లో స్లీపర్ క్లాస్ లో – 864 బెర్త్ లు, ఏసీ మూడవ క్లాసు – 192, ఏసీ రెండవ క్లాసు – 96, ఏసీ మొదటి క్లాసు లో 18 సీట్లు మొత్తం కలిపి 1170 మంది ప్రయాణికులు నిరంతరం ప్రయాణిస్తూ ఉంటారు. ఈ రైలు లో బెర్త్ దొరికితే అదృష్టమే అన్నంతగా భావిస్తారు ఈ రైలు ప్రేమికులు.
గోదావరి రద్దీని దృష్టిలో ఉంచుకుని దీని సమయాలకు సమీపంలోనే గరిబ్ రధ్, దురంతో లాంటి సూపర్ ఫాస్ట్ రెండు కొత్త రైళ్ళు ప్రవేశపెట్టినప్పటికీ, ఈ రైలుకి ఇప్పటికి భారి రద్దీ ఉండడం విశేషం. ప్రజల డిమాండ్ మేరకు కొన్నిమార్లు రిజర్వేషన్ లేని జనరల్ భోగీలను స్లీపర్, మూడవ క్లాసు ఏసీ భోగిలుగా మారుస్తుంటారు.విశాఖ, హైదరాబాద్ మధ్య వెళ్ళు రైలు మార్గాలలో ఈ రైలు వెళ్ళే మార్గాన్ని బెస్ట్ రూట్ గా భావిస్తారు. అందుకే అధికారులు దీన్ని పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. గోదావరి ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే ఆధీనంలో ఉంది .ఈ రైలును భుభనేశ్వర్ వరకు పొడిగించాలని ప్రతిపాదనలు వచ్చినప్పటికీ ఉత్తరాంధ్ర ప్రజలు, రాజకీయ నాయకులూ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తరువాత విశాఖ ఎక్స్ప్రెస్ ను భువనేశ్వర్ వరకు పొడిగించారు.. కానీ గోదావరి ని అలానే ఉంచేసారు.
కోస్తా ను హైదరాబాద్ కు కలిపే ప్రయత్నమే గోదావరి...
సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కోస్తా ప్రాంతాలని అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని హైదరాబాద్ కు కలపాలనేదే గోదావరి ఎక్స్‌ప్రెస్ ప్రారంభ లక్ష్యం. ఈ రైలు విశాఖపట్నం జిల్లా లోని 5 స్టేషన్లు, పశ్చిమ గోదావరి లోని 3 స్టేషన్లు, తూర్పు గోదావరి లోని 6 స్టేషన్లు,, కృష్ణ జిల్లా విజయవాడ మీదుగా తెలంగాణ లోకి ప్రవేశిస్తుంది
1974 ఫిబ్రవరి 1 న, భారత రైల్వే, విశాఖపట్నం నుండి హైదరాబాద్ మధ్యన తన మొదటి రైల్వే సర్వీస్ వాల్తైర్-హైదరాబాద్ రైలును ప్రారంభించింది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఈ రైలును రోజు నడుపుతున్నారు. విశాఖపట్నం నుండి సాయంత్రం 5:20 కి బైలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30 నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం ల హైదరాబాద్ నుండి సాయంత్రం 5:15 నిమిషాలకు బయిలుదేరి మరుసటి రోజు ఉదయం 6:45 నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది.
గోదావరి అనే పేరు ఎందుకు వచ్చిందంటే...
మొదట ఈ ట్రైన్ కు వాల్తైర్-హైదరాబాద్ ఎక్స్ప్రెస్ రైలు అని మాత్రమే ఉండేది. అయితే ఈ ట్రైన్ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ల ఉన్న మొత్తం 9 స్టేషన్లలో ఈ రైలు ఆగేది. దీంతో గోదావరి జిల్లాల వాళ్ళతోనే ఈ ట్రైన్ నిండి పోయేది. దీంతో ఎక్కువ మంది గోదావరి వాళ్ళే ప్రయాణిస్తూ ఉండడం వల్ల మొదట అనధికారికంగా తర్వాత. అధికారికంగా గోదావరి ఎక్స్‌ప్రెస్ అని పరు పెట్టారు.
మొదట్లో ఐదు బోగీలు, ప్రస్తుతం 24 బోగీలు...
ఐదు భోగీ లతో మొదట ఈ రైల్ ను స్టీమ్ లోకోమోటివ్ ఇంజిన్ సహాయం తో నడిపేవారు. 1980 లో సింహాద్రి ఎక్ష్ప్రెస్స్ ని భీమవరం వరకు పొడిగించి, కాకినాడ – సికింద్రాబాద్ మధ్య గౌతమి ఎక్ష్ప్రెస్ ను పెట్టినప్పటికీ గోదావరి బోగీల సంఖ్య 17 కి పెంచాల్సి వచ్చింది. ఆ తర్వాత డిమాండ్ మేరకు 5 బోగీలు ఉంచుతూ, డీజిల్ లోకోమోటివ్ ఇంజిన్ ప్రవేశపెట్టారు. 1990 నాటికీ, గోదావరి ఎక్ష్ప్రెస్స్ కి మంచి పేరు వచ్చింది. దీంతో ఈ రైలుకు మరింత రద్దీ పెరిగింది. అధికారులు మరో 2 భోగీలను ఇచ్చారు. దీనితో కలిపి 24 భోగీలతో గోదావరి ఎక్ష్ప్రెస్స్ అప్పట్లో, దేశంలో పొడవైన రైలు సర్విసుల్లో ఒకటిగా నిలిచింది. విశాఖపట్నం – విజయవాడ , విజయవాడ – కాజీపేట – హైదరాబాద్ లైన్లను విద్యుదీకరణ చేయటంతో గోదావరి ఎక్ష్ప్రెస్ కు WAP-4 ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజిన్ ను ప్రవేశపెట్టారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 5 ఏ.సి. భోగిలతో నడిచే మొదటి రైలుగా గోదావరి ఎక్ష్ప్రెస్ మంచి పేరు సంపాదించుకుంది. జూన్ 1999 న వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో పట్టాలు తప్పటంతో గోదావరి ఎక్ష్ప్రెస్స్ మొదటి ప్రమాదాన్ని నమోదు చేసుకుంది.
ఎన్నో చారిత్రక విశేషాలు...
2000 వ సంవత్సరం లో గోదావరి ఎక్స్‌ప్రెస్ తన సొంత ఎయిర్ కండిషన్డ్ మొదటి తరగతి కోచ్ తో అనుసంధానించబడ్డ దక్షిణ మధ్య రైల్వేలో మొదటి రైలు అయ్యింది,, మొత్తం జోన్ లో 6 ఎయిర్ కండిషన్డ్ కోచ్ కలిగి ఉన్న మొదటి రైలు అయ్యింది. 2011 లో గోదావరి ట్రైన్ నంబర్ 12727 గా మారి సూపర్ ఫాస్ట్ స్టేటస్ వచ్చింది. విజయవాడ, హైదరాబాద్ మధ్య WAP 7 లోకోమోటివ్ తో ప్రస్తుతం గోదావరి నిరంతరాయంగా నడపబడుతోంది. 50 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దశాబ్దాలుగా ఇందులో సేవలు అందిస్తున్న రైల్వే సిబ్బంది కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేయడం అందరినీ ఆకట్టుకుంది