Category : | Sub Category : తాజా వార్తలు Posted on 2024-01-25 18:38:10
TWM Live News : గురజాల మండలం పల్లెగుంత గ్రామంలో మిర్చి పంటను అధికంగా సాగు చేస్తారు. గత రెండేళ్ళుగా మిర్చికి మంచి ధర ఉండటంతో రైతులు ఈ ఏడాది అధికంగా మిర్చి సాగు చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో దిగుబడులు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి.. ఎకరానికి ఇరవై నుంచి ముప్పై క్వింటాళ్ళ దిగుబడి వస్తుందని రైతులు అంటున్నారు. గత ఏడాదితో పోల్చితే ధర కొంతమేర తగ్గినా క్వింటాకు 15000 నుండి 20000 రూపాయలు వస్తున్నాయి.
గ్రామానికి చెందిన రమణయ్య ఐదు ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. మొదటి కోతలో దాదాపు పదిహేను క్వింటాళ్ళ దిగుబడి వచ్చింది. మిర్చిని కళ్ళంలో ఆరపోశారు. మిర్చి ఎండిన తర్వాత విక్రయిస్తుంటారు. రాత్రి పొద్దు పోయే వరకూ కళ్ళంలోనే ఉన్న రమణయ్య మిర్చిని కుప్ప చేసి ఇంటికి వెళ్ళాడు. తెల్లవారే సరికి కళ్ళంలోకి వచ్చి చూడగా మిర్చి మొత్తం తగులపడి పోయింది. దీంతో రైతు ఒక్కోసారిగా కుప్ప కూలిపోయాడు. కళ్ళంలో అనేకమంది రైతుల మిర్చి ఉంటే కేవలం రమణయ్య మిర్చిని మాత్రమే తగులపెట్టారు దీంతో వ్యక్తి గత కక్షలతో నే మిర్చిని తగులపెట్టినట్లు రమణయ్య భావిస్తున్నాడు. 240000 రూపాయల విలువ చేసే మిర్చి మొత్తం కాలి బూడిదైందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి పంటను సాగు చేశానని అయితే చేతికొచ్చిన పంటను తగల పెట్టారన్నారు.