పశ్చిమ ఏజెన్సీలో పులి భయం.. ఒంటరిగా వెళ్లేందుకు భయపడుతున్న జనం..
Category : |
Sub Category : తాజా వార్తలు Posted on 2024-01-24 18:44:21
TWM Live News : ఏలూరు జిల్లా ఏజెన్సీలో పులి భయంతో స్థానికులు వణికి పోతున్నారు. అదిగో పులి అంటే ఇదిగో పులి అనే విధంగా ఇక్కడ పరిస్థితి తయారయింది. గుర్తుతెలియని జంతువు పాదముద్రలు స్థానికులు గుర్తించడంతో.. అవి పులివేనంటూ ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా తమ పంట పొలాల్లోకి వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లాలంటేనే భయపడుతూ ఇంటి వద్దనే కాలం వెళ్లదీస్తున్నారు. అధికారులు సైతం పాదముద్రలు ఏ జంతువువని కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు.
ఇక బుట్టాయిగూడెం మండలం ముంజలూరు శివారు అటవీ ప్రాంతంలో నిన్న ఓ ఆవుపై గుర్తు తెలియని జంతువు దాడి చేసి చంపి దాని శరీరంలో సగభాగం తినేసింది. అదే ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం జంతువు దాడిలో ఓ దూడ మృతి చెందింది. అయితే, పులే వాటిపై దాడి చేసి అక్కడి నుంచి బుట్టాయిగూడెం కొయ్యలగూడెం మండల పరిసర ప్రాంతాల్లో తిరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే అధికారులు పులి పాదముద్రలు గుర్తించిన ప్రదేశాలలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులి సంచారాన్ని కనిపెట్టాలని కోరుతున్నారు.