Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2025-05-07 10:50:47
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రస్థావరాలపై జరిగిన మెరుపుదాడులపై ప్రపంచ దేశాలు స్పందించాయి. భారత్-పాక్‌ల ఘర్షణ త్వరగా ముగుస్తుందని అమెరికా ఆకాంక్షించింది. భారత్ దాడి చేయడం విచారకరమంటూ చైనా వ్యాఖ్యానించింది. భారత్, పాకిస్థాన్ రెండూ తమ పొరుగుదేశాలని తెలిపింది. రెండు దేశాల మధ్య ఘర్షణను ప్రపంచం భరించలేదని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.
\'పరిస్థితులను పరిశీలిస్తున్నాం\'
భారత వైమానిక దాడులకు సంబంధించిన నివేదికల గురించి తమకు తెలిసిందని అమెరికా ప్రకటించింది. భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. దాడులు జరిగిన వెంటనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోకు ఫోన్ చేశారు. దాడుల గురించి వివరించారు. అత్యంత కచ్చితత్వంతో దాడులు జరిపామని, పాక్ పౌరులు, ఆర్థిక, సైనిక స్థావరాల జోలికి వెళ్లలేదని డోభాల్ పేర్కొన్నట్లు వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
భారత్-పాక్ మధ్య ఘర్షణలు అతి త్వరగా ముగిసిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు. భారత్ జరిపిన మెరుపు దాడులపై స్పందించిన ఆయన, గత పరిణామాలను ప్రకారం ఏదో జరగబోతోందని ప్రజలకు తెలుసని అనుకుంటున్నట్లు చెప్పారు. \"మేం ఓవల్ ఆఫీసులోకి వెళ్తున్నప్పుడు దాడుల గురించి విన్నాం. గత పరిణామాలను ప్రకారం ఏదో జరగబోతోందని ప్రజలకు తెలుసని నేను అనుకుంటున్నాను. ఇరు దేశాలు చాలాకాలంగా పోరాడుతున్నాయి. మీరు దాని గురించి ఆలోచిస్తే ఇరు దేశాలు దశాబ్దాలుగా, శతాబ్దాలుగా పోరాడుతున్నాయి. ఈ పోరాటం చాలా త్వరగా ముగుస్తుందని నేను ఆశిస్తున్నాను\" అని ట్రంప్ తెలిపారు.
\'ఉద్రిక్తతలను నివారించాలి\'
అటు భారత్, పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారులతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో మాట్లాడారు. ఇరు దేశాలు కమ్యూనికేషన్ మార్గాలను తెరిచి ఉంచాలని, ఉద్రిక్తతలను నివారించాలని కోరారు. భారత్, పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ సమస్య త్వరగా ముగిసిపోతుందని ఆశిస్తున్నట్లు రాసుకొచ్చారు. శాంతియుత పరిష్కారం కోసం ఇరు దేశాల అగ్రనాయకులను సంప్రదిస్తానని తెలిపారు.