Category : | Sub Category : క్రీడా Posted on 2024-07-29 10:25:17
Paris olympics 2024: పారిస్ ఒలింపిక్స్ గ్రూప్ దశలో భారత షట్లర్ లక్ష్య సేన్ గెలిచిన ఓ మ్యాచ్ ఫలితాన్ని నిర్వాహకులు రద్దు చేశారు. దానికి కారణమేంటంటే..?
Paris olympics 2024 ఇంటర్నెట్ డెస్క్: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ కు వింత పరిస్థితి ఎదురైంది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ గ్రూప్ దశలో అతడు ఒక మ్యాచ్ గెలిచినప్పటికీ ఆ ఫలితం రద్దయ్యింది. ప్రత్యర్థి ఆటగాడు గాయపడటమే ఇందుక్కారణం. అసలేం జరిగిదంటే.
బ్యాడ్మింటన్ (Badminton) పురుషుల సింగిల్స్ గ్రూప్ ఎల్లో భాగంగా లక్ష్య సేన్.. గత శనివారం తన తొలి మ్యాచ్ లో గ్వాటెమాలా ఆటగాడు కెవిన్ కార్డన్తో తలపడ్డాడు. ఈ మ్యాచ్లో తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన లక్ష్య వరుస సెట్లలో 21-8, 22-20తో విజయం సాధించాడు. అయితే ఈ మ్యాచ్ తర్వాత కెవిన్ ఎడమ మోచేతి గాయం కారణంగా పారిస్ ఒలింపిక్స్ (Paris olympics 2024) నుంచి వైదొలిగాడు.
ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ జనరల్ కాంపిటిషన్ నిబంధనల ప్రకారం.. గ్రూప్ దశలో ఇలా ఎవరైనా గాయపడి టోర్నీ నుంచి నిష్క్రమిస్తే వాళ్లు ఆడిన లేదా ఆడాల్సిన మ్యాచ్లను పరిగణనలోకి తీసుకోరు. వాటి ఫలితాలను టోర్నీ నుంచి తొలగిస్తారు. ఈ క్రమంలోనే లక్ష్య సేన్ తొలి విజయాన్ని ఒలింపిక్స్ నిర్వాహకులు రికార్డుల నుంచి తొలగించారు. అలాగే కెవిన్ ఆడాల్సిన మిగతా రెండు మ్యాచ్ లను రద్దు చేశారు.
కెవిన్ వైదొలగడంతో ఇప్పుడు గ్రూప్ ఎల్లో ముగ్గురు ఆటగాళ్లే మిగిలారు. లక్ష్య సోమవారం తన తర్వాత మ్యాచ్ లో బెల్జియం ఆటగాడు జులియన్ కరాగీతో తలపడనున్నాడు. ఆ తర్వాత బుధవారం ఇండోనేషియా షట్లర్ జొనాతన్ క్రిస్టీతో ఆడనున్నాడు. దీంతో ఈ గ్రూప్ లో మూడు మ్యాచ్లు ఆడేది లక్ష్య ఒక్కడే. ర్యాంకింగ్స్ను బట్టి టాప్లో ఉన్నవారు తర్వాత దశకు చేరుకుంటారు.
సాత్విక్-చిరాగ్ జోడీ మ్యాచ్ రద్దు..
అటు బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో భారత షట్లర్ల ద్వయం సాత్విక్-చిరాక్ రెండో మ్యాచ్ రద్దయ్యింది. వీరు సోమవారం మార్క్ లమ్స్ఫస్-మార్విన్ సీడెల్ జోడీతో ఆడాల్సి ఉంది. అయితే, మార్కు మోకాలి గాయం కావడంతో అతడు టోర్నీ నుంచి వైదొలిగాడు. దీంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.