Category : | Sub Category : క్రీడా Posted on 2024-07-29 09:31:19
IND Vs SL: ఆదివారం వర్ష ప్రభావిత రెండో టీ20లో టీమ్ ఇండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ సందర్భంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడారు.
IND Vs SL పల్లెకెలె: శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ కైవసం చేసుకుంది. గౌతమ్ గంభీర్ కోచ్ గ , సూర్యకుమార్ యాదవ్ టీ20 జట్టు కెప్టెన్ గ నియమితులయ్యాక జరిగిన తొలి సిరీస్ ను టీమ్ ఇండియా సొంతం చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా కెప్టెన్ మాట్లాడుతూ.. ఇకపై పొట్టి ఫార్మాట్లో సానుకూల దృక్పథం, భయంలేని ఆటతీరుతో ముందుకు సాగుతామని తెలిపాడు.
మేం ఎలా ఆడాలనుకుంటున్నామో టోర్నమెంట్ ఆరంభానికే ముందే చెప్పాం. ఇదే ధోరణితో ముందుకు వెళ్లాలనుకుంటున్నాం. వాతావరణాన్ని పరిశీలించాక శ్రీలంకను 160 పరుగుల కంటే తక్కువకు కట్టడి చేయాలని భావించాం. అందుకు తగ్గట్టే మా బౌలర్లు రాణించారు. వర్షం రావడం మాకు కలిసొచ్చింది. బ్యాటర్ల ఆటతీరు అద్భుతం. ఇప్పటి వరకు బెంచ్కు పరిమితమైన వారిని తర్వాత మ్యాచ్లో ఆడించడంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అని సూర్యకుమార్ తెలిపాడు. రెండు మ్యాచుల్లోనూ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్య జట్టుకు సిరీస్ ను అందించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఆదివారం వర్ష ప్రభావిత రెండో టీ20లో టీమ్ ఇండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్ మొదలవగానే వర్షం పడి.. గంటకు పైగా ఆట ఆగింది. దీంతో భారత్ లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులుగా సవరించారు. యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య చెలరేగడంతో భారత్ 6.3 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఆ బంతులే కలిసొచ్చాయి: బిష్ణోయ్
తొలి టీ20లో బంతిని అందుకునే ప్రయత్నంలో కంటి కింద గాయమైన స్పిన్నర్ రవి బిష్ణోయ్ రెండో మ్యాచ్లో కీలక పాత్ర పోషించాడు. నిశాంకను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని లంక జోరుకు బ్రేకులేశాడు. ఆ తర్వాత శానక (0), హసరంగ (0)లను డకౌట్ చేసిన అతడు లంక కష్టాలను ఇంకా పెంచాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ...మొదటి మ్యాచ్లో పోలిస్తే పిచ్ కాస్త భిన్నంగా ఉంది. తొలి ఇన్నింగ్స్లో స్పిన్నర్లకు సహకరించింది. దీంతో నేను నా ప్రణాళికలకే పరిమితమయ్యా. ఆఫ్ నుంచి లెగ్ సైడ్ టర్న్ అయ్యే బంతులను సంధించడం కలిసొచ్చింది. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం ఒక బాధ్యత. కెప్టెన్, మేనేజ్మెంట్ నాపై ఉంచిన విశ్వాసానికి అది నిదర్శనం అని అన్నాడు. అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
మిడిలార్డర్ వైఫల్యం: చరిత్ అసలంక
మరోసారి మిడిలార్డర్ కుప్పకూలడంపై శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కావాల్సిన సమయంలో ఆడలేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని తెలిపాడు. చివర్లో మేం ఆడిన తీరుపై నేను చాలా అసంతృప్తితో ఉన్నా. మేం చాలా మెరుగవ్వాల్సి ఉంది. ఈ పిచ్ లో సమయం గడుస్తున్న కొద్దీ బ్యాటింగ్ చేయడం కష్టంగా మారుతుంది. ప్రొఫెషనల్ క్రికెటర్లుగా మేం ఇంకా బాగా ఆడాల్సి ఉంది. మేం అదనంగా 15-18 పరుగులు చేయాల్సింది. వాతావరణం కూడా దాని పాత్ర పోషించింది. వర్షం పడటంతో ఎనిమిది ఓవర్లు బౌలింగ్ చేయడం అంత సులభమైన విషయం కాదు అని అసలంక అన్నాడు.