Category : | Sub Category : బ్రేకింగ్ వార్తలు Posted on 2024-07-29 09:16:24
TWM NEWS:సియోల్: ఒకవేళ యుద్ధం వస్తే అధినేత ఆదేశాలతో శత్రువులను వినాశనం చేస్తామని ఉత్తర కొరియా పేర్కొంది. కొరియన్ యుద్ధ విరమణ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సైనిక ఉన్నతాధికారులు ఈ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పాల్గొన్న ఆ భేటీలో.. సైనికాధికారులు ఈ విధంగా స్పందించినట్లు ఉ.కొరియా అధికారిక మీడియా వెల్లడించింది. అణుయుద్ధానికి అమెరికా, దక్షిణ కొరియాలు రెచ్చగొడుతున్నాయి. ఈ తరుణంలో అధినేత ఆదేశాలతో ఎటువంటి ఆలస్యం లేకుండా శత్రువును పూర్తిగా నాశనం చేసేందుకు అవసరమైన యుద్ధ సామర్ధ్యాలను మరింత బలోపేతం చేసుకుంటామని ఉత్తర కొరియా సైనికాధికారులు ప్రతిజ్ఞ చేశారు. దక్షిణ కొరియాతో మూడేళ్ల యుద్ధానికి విరామమిస్తూ.. అమెరికా, చైనాలతో జులై 27, 1953న ఉత్తర కొరియా ఓ తాత్కాలిక సంధి చేసుకుంది. జులై 27న విక్టరీ దినోత్సవంగా ఉత్తర కొరియా ఉత్సవాలు నిర్వహించుకుంటుండగా.. దక్షిణ కొరియా మాత్రం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించదు. అయితే, అది కేవలం తాత్కాలిక సంధిగానే పరిగణిస్తున్నారు.