Category : | Sub Category : రాజకీయం Posted on 2024-07-27 11:18:47
నాటి ఆర్థిక అవకతవకలపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ అవసరం. నిధులు మళ్లించి.. ప్రజలను కష్టాల్లోకి నెట్టారు సభ్యుల ప్రశ్నలకు మంత్రి పవన్ కల్యాణ్ సమాధానం శ్వేతపత్రం విడుదల చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడి
TWM News: గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. నాడు ఆర్ధిక సంఘం నిధుల మళ్లింపు వల్ల పంచాయతీలకు జరిగిన నష్టాలు, ఇతర అవకతవకలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రం పంచాయతీలకు విడుదల చేసే ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై ఎమ్మెల్యేలు కూన రవి కుమార్, చింతమనేని ప్రభాకర్, గొండు శంకర్, బి. రామాంజనేయులు, చరితారెడ్డి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వారి ప్రశ్నలకు సమాధానమిస్తూ.. \'గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఆర్థిక సంఘం నిధులను కేంద్రం పంచాయతీల ఖాతాలకు జమ చేసినా.. వాటిని ఖాళీ చేసేవారు. సర్పంచులకు తెలియకుండా రూ.2,285 కోట్ల నిధులను విద్యుత్తు పంపిణీ సంస్థలకు మళ్లించారు. దీంతో పంచాయతీలు పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించలేక రూ. 103 కోట్ల మేర బకాయి పడ్డాయి. నిధులు లేకపోవడంతో పాడైన మోటార్లకు మరమ్మతులు చేయలేక, పైపులైన్ల లీకేజీలు సరిచేయలేక గ్రామాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఎస్ఈడీ వీధి దీపాల నిర్వహణను గాలికి వదిలేశారు. రాష్ట్ర జనాభాలో 71 శాతం మంది గ్రామాల్లో నివసిస్తుండగా.. వారికి కనీస సౌకర్యాలు కల్పించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది\' అని వివరించారు.