Category : | Sub Category : రాజకీయం Posted on 2024-07-27 10:49:49
జగన్ పాలనలో మొత్తం అప్పులు, చెల్లింపుల భారం రూ. 9,74,556 కోట్లు ఇంకా అప్పులు, పెండింగు బిల్లులు వెలికితీస్తూనే ఉన్నాం ఈ ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటాం.. రాత్రీ, పగలూ కష్టపడతాం రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెడతాం శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం విడుదల.
గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని విషవలయంగా మార్చేశారు. ఉన్న నిధులను మళ్లించి, ఆస్తులను తాకట్టు పెట్టేశారు. పెద్ద ఎత్తున అప్పులు చేసేశారు. అప్పు చేసినా మూలధన వ్యయం తగ్గించేశారు. ఫలితంగా ఉత్పత్తి లేక.. రాబడి తగ్గిపోయింది. పన్నులు, అప్పులు పెరిగిపోయాయి. మా ప్రభుత్వంలో రూ.100 అప్పు చేస్తే రూ. 59.15 ఆస్తులు సృష్టించేందుకు ఖర్చుచేశాం. అదే జగన్ ప్రభుత్వం రూ.100 అప్పు చేస్తే కేవలం రూ.22.54నే ఆస్తుల కల్పనకు వెచ్చించింది.
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. మరోవైపు రాష్ట్రానికి రాబడి తగ్గి, అప్పులు పెరిగిపోయాయి. అప్పులు, చెల్లింపుల మొత్తం భారం రూ.9.74 లక్షల కోట్లకు చేరిపోయింది. ఒక్క జగన్ ప్రభుత్వంలోనే ఈ అప్పులు, చెల్లింపుల భారం రూ.5,99,261 కోట్లు\" అని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం రాష్ట్ర శాసనసభలో వెలువరించిన శ్వేతపత్రంలో ప్రకటించారు.
రాష్ట్రం మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లకు చేరినట్లు లెక్కలు తేలినా ఇంకా వెలికితీస్తూనే ఉన్నాం. ఇవి మన దృష్టికి వచ్చిన, తెలిసిన అప్పులు. పెండింగు బిల్లులు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. ఎవరి దృష్టికి ఏ విషయం వచ్చినా తెలియజేయండి. అన్నీ క్రోడీకరించి పూర్తి విధ్వంసం ఎంతో తేలుద్దాం అని ముఖ్యమంత్రి ప్రకటించారు. గత ఐదేళ్లలో తలసరి అప్పు ఎలా పెరిగింది. తలసరి రాబడి ఎలా తగ్గింది, ఏ రూపేణా ఎంత నష్టం వాటిల్లిందన్న సమగ్ర లెక్కలు, విశ్లేషణలతో ముఖ్యమంత్రి వివరించారు. ఆ ప్రజంటేషన్ ఇస్తూ అనేక వ్యాఖ్యలు చేశారు.
బహుశా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎవరూ ఇన్ని రకాలుగా అప్పులు చేసి ఉండరు. జగన్ కు వచ్చినన్ని తప్పుడు ఆలోచనలు ఎవరికీ వచ్చి ఉండవు. ఒకవైపు విశాఖను రాజధాని అన్నారు. అక్కడ ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేశారు. మిగిలిన భూములను వైకాపా నాయకులు కబ్జా చేసేశారు. ఎక్సైజ్ ఆదాయం బెవరేజెస్ కార్పొరేషన్కు, రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్కు మళ్లించి వేలకోట్ల అప్పులు తెచ్చేశారు. రాబోయే 15 ఏళ్ల ఎక్సైజ్ రాబడి ఇప్పుడే తాకట్టు పెట్టేశారు. మన ప్రభుత్వమూ ఆ రాబడి అంతటినీ అప్పులు తీర్చేందుకు కట్టేయాల్సిందే. ఆఖరికి ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్ నిధుల్లో రూ.3,143 కోట్లు ఖర్చుచేసి మద్యం బాండ్లు కొనిపించేశారు. అభయహస్తం కింద డ్వాక్రా మహిళలు దాచుకున్న సొమ్ములో రూ.2,100 కోట్లు తీసేసి జగన్ ప్రభుత్వం వాడేసుకుంది. వివిధ కార్పొరేషన్లు, సొసైటీల వద్ద ఉన్న రూ.4,738 కోట్లలోనూ కొంత వాడేసుకున్నారు అని చంద్రబాబు శ్వేతపత్రంలో వివరించారు.
దుర్మార్గుడు పాలిస్తే ఏం జరుగుతుందో చూశాం
తెలంగాణలో ప్రభుత్వాలు మారినా అభివృద్ధిని కొనసాగించారు. రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను 2014-19 మధ్య ఇతర రాష్ట్రాలతో పోటీపడేలా చేశాం. తెలంగాణ కన్నా ఎక్కువ అభివృద్ధి చేశాం. గడిచిన ఐదేళ్ల జగన్ పాలనలో ఆ వ్యవస్థ దెబ్బతింది. దీంతో రాష్ట్రం కోలుకోలేని దుస్థితికి చేరింది. ప్రభుత్వాలు ఎక్కడైనా మారతాయి. కానీ దుర్మార్గుడు పాలకుడిగా వస్తే ఏం జరుగుతుందో చూశాం. విభజనతో ఆంధ్రప్రదేశ్ ఎంతో నష్టపోయింది. సేవారంగాన్ని కోల్పోయాం. వ్యవసాయరంగం ఏపీకి వచ్చింది. జీతాలు, పింఛన్లు కూడా ఇవ్వలేని దుస్థితి. అయినా ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చాం. 34% సంక్షేమంపై ఖర్చుచేశాం. రాష్ట్ర ఆర్థికవ్యవస్థను దేశంలోనే తొలి మూడు స్థానాల్లోకి తీసుకొచ్చాం. దేశ సగటు కన్నా తయారీ రంగంలో ముందున్నాం. రాష్ట్ర రెవెన్యూ రాబడులు మన ప్రభుత్వంలో 13.2% పెరిగాయి. తలసరి ఆదాయం పెరుగుదల రేటు 13.2%. దేశ సగటు కన్నా ఏపీలో ఎక్కువ ఉండేది. 7,72 లక్షల ఉద్యోగాలు కల్పించాం. కానీ, జగన్ ప్రభుత్వంలో వ్యవసాయరంగం వృద్ధి 16% నుంచి 11.9%కు పడిపోయింది. సేవారంగంలో 11.9% నుంచి 9.9%కు పడిపోయాం. పెరుగుదల రేటు తగ్గిపోవడంతో రాష్ట్రం రూ.6.94 లక్షల కోట్లు నష్టపోయింది. 2014-19 మధ్య వృద్ధిరేటు కొనసాగి ఉంటే రూ.76,195 కోట్ల ఆదాయం పెరిగేది. కొవిడ్ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్నా రూ.52,197 కోట్ల ఆదాయం పెరిగింది. మన అభివృద్ధిని జగన్ కొనసాగించకపోవడం వల్ల ఎంతో నష్టం వాటిల్లింది అని చంద్రబాబు పేర్కొన్నారు.
డీబీటీ నిధులు ఎక్కడికి పోయాయి?
జగన్ ప్రభుత్వంలో సుస్థిర ఆర్థిక పరిస్థితి లేకుండా పోయింది. తలసరి అప్పు రూ.74,790 నుంచి రూ.1,44,336కు పెరిగింది. తలసరి ఆదాయం మా ప్రభుత్వంలో 13.2%కు పెరగ్గా జగన్ హయాంలో 9.5%కు తగ్గింది. డీబీటీ పథకాల ద్వారా రూ.2,71,000 కోట్లకు బటన్ నొక్కామంటున్నారు. ఆ నిధులన్నీ ఎక్కడికి పోయాయి? పేదవాడికి ఉపయోగపడని పనులు జగన్ చేశారని అర్థమవుతోంది అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
రూ.వంద కోట్ల సంపద పెరిగిందట
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకాయన నా వద్దకు వచ్చారు. ఈ ప్రభుత్వంపై నమ్మకం వల్ల ఆయన ఆస్తుల విలువ రూ.100 కోట్లు పెరిగిందట. అన్నక్యాంటీన్లకు రూ.కోటి విరాళంగా ఇచ్చారు. అదీ ఆర్థికవ్యవస్థ అంటే రాష్ట్రంలో ఆర్థికవ్యవస్థ బాగుంటే సంపద పెరుగుతుంది. భూముల విలువ పెరుగుతుంది. అంతా బాగుంటే మంచి పనుల కోసం ఇలా డబ్బులు వెచ్చిస్తారు అని చెప్పారు.
వినూత్న ఆలోచనలతో పాలిద్దాం
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తోంటే భయం వేస్తోంది. ఇంకా సూపర్ సిక్స్ అమలు చేయాలి. ఏం చేయాలన్నా ముందుకు కదల్లేకపోతున్నాం. ప్రజాజీవితంలో ఉండేవారు బాధ్యతాయుతంగా ఉండాలి తప్ప, పెత్తందారులుగా ఉండకూడదు. ప్రస్తుతం సంపద సృష్టించే చర్యలు చేపట్టాలి. కొత్త తరహాలో ఆలోచించాలి. జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సమీకరిస్తున్నారు. ఊళ్ల నుంచి మండలాలకు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, పోర్టులకు, విమానాశ్రయాలకు రహదారులు నిర్మించాలి. ఇందుకు ప్రభుత్వం వెచ్చించదగ్గ సొమ్ములు పోగా మిగిలినవాటిని ప్రైవేటు నుంచి సమీకరించి నిర్మాణాలు చేపట్టాలి. ఆ తర్వాత టోల్ రూపంలో వసూలు చేసుకునే అవకాశం కల్పించాలి. ప్రభుత్వం ఎన్ని నిధులు పెడుతుంది, ప్రైవేటు నుంచి ఎంత సేకరించాలో నిర్ణయించుకోవాలి. వినూత్న విధానాలతో రాష్ట్రాన్ని బాగుచేయాలి. రాష్ట్ర పునర్మిర్మాణం కోసం రాత్రింబవళ్లు పనిచేస్తాం అని చంద్రబాబు ప్రకటించారు.
జగన్ ఆనందం కోసం రూ.500 కోట్లా?
జగన్ ఇంట్లో కూర్చుని సముద్రం చూసేందుకు రూ.500 కోట్లు వెచ్చిస్తారా? రుషికొండను ధ్వంసం చేసి తన కోసం ప్యాలెస్ కట్టుకున్నారు. ఈ విషయంలో ప్రజల స్పందన ఏమిటి? ఇవే నిధులు పర్యాటక రంగం కోసం ఖర్చుచేస్తే రూ.వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది కాదా? రుషికొండ విషయంలో ఎలా మభ్యపెట్టారు? ఇంకా ఎలా మభ్యపెడుతున్నారో చూడండి.
అధికారులూ క్షోభ అనుభవించారు
దుర్మార్గుడి పాలనలో అధికారులూ క్షోభ పడ్డారు. బిల్లులు చెల్లించలేకపోయారు. వాటికోసంబాధితులు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం చెప్పినా సొమ్ములు ఇవ్వలేక అధికారులు కోర్టుధిక్కరణ కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఐఏఎస్ అధికారులు జైలుశిక్షలు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్ని తప్పులు ఎలా సరిదిద్దుతాం? ఒకటి, రెండు తప్పులంటే సరిదిద్దగలం అని వ్యాఖ్యానించారు.