Category : | Sub Category : క్రీడా Posted on 2024-07-27 10:15:27
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: పారిస్ ఒలింపిక్స్ లో ఆర్చరీ విభాగంలో భారత జట్లు శుభారంభం చేశాయి. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. దీంతో ఇప్పుడు ఈ 22 ఏళ్ల కుర్రాడి గురించే చర్చ నడుస్తోంది. ఇతడి గురించి నెటిజన్లు వెతకడం ప్రారంభించారు.
తొలిసారి ఆడుతున్న బొమ్మదేవర ధీరజ్.. ర్యాంకింగ్ రౌండ్లో అదరగొట్టి, భారత్ టాప్-4లో నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. గురువారం పురుషుల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్లో ప్రపంచకప్ కాంస్య పతక విజేత ధీరజ్ అదిరే ప్రదర్శనతో 681 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచాడు.
• ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన ధీరజ్.. సెప్టెంబర్ 3, 2001న జన్మించాడు. పురుషుల రికర్వ్ ఆర్చరీలో వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో ప్రాతినిధ్యం వహించే ఈ కుర్రాడు.. అద్భుత విజయాలతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. పారిస్ ఒలింపిక్స్ లో రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించడంలో కీలకంగా నిలిచి మరో ఘనత
సాధించాడు.
• ధీరజ్ తండ్రి బొమ్మదేవర శ్రవణ్కుమార్ ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో సాంకేతిక అధికారిగా విధులు నిర్వర్తించాడు. దీంతో కుమారుడికి ఆర్చరీపై చినప్పటినుంచే ఆసక్తి ఏర్పడింది.
• చిన్న వయసులోనే విజయవాడలోని వోల్గా ఆర్చరీ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో నాలుగేళ్ల పాటు ట్రైనింగ్ పొందాడు. 2021లో ఇండియన్ ఆర్మీలో చేరాడు. హవల్దార్ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు.
• ప్రపంచస్థాయిలో ధీరజ్ 2017లో అరంగేట్రం చేశాడు. 2021 వరల్డ్ ఆర్చర్ యూత్ ఛాంపియన్షిప్లో తొలిసారి గోల్డ్ మెడల్ సాధించాడు.
• ప్రపంచ స్థాయి 15వ ర్యాంక్ ఆటగాడైన ధీరజ్.. బ్యాంకాక్లో జరిగిన పోటీల్లో అద్భుత ప్రదర్శన చేసి పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు.
• ఆసియా క్రీడలు 2023లో రజత పతకాన్ని సాధించిన భారత పురుషుల జట్టులో ధీరజ్ ఒకరు. అతానుదాస్, తుషార్ షెల్కేతోపాటు ఆ పోటీల్లో పాల్గొన్నాడు. ఈ టీమ్ ఫైనల్లో రిపబ్లిక్ ఆఫ్ కొరియా చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది.
• టర్కీలోని అంటాల్యలో జరిగిన ప్రపంచకప్ 2024లో తన ప్రతిభతో కాంస్య పతకాన్ని సాధించాడు.
• ధీరజ్ అద్భుత ప్రదర్శన ఇలాగే కొనసాగి.. భారత్కు పతకాల పంట పండించాలని కోట్లాదిమంది అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.