Category : | Sub Category : రాజకీయం Posted on 2024-07-26 09:08:42
తెలంగాణ ఆవిర్భావం తర్వాత గత దశాబ్ద కాలంలో రాష్ట్రం ఆశించినంత పురోభివృద్ధి సాధించలేదు. పైగా సంక్షేమం సన్నగిల్లింది. రాష్ట్రం అప్పులపాలైంది. చినికిచినికి గాలివానలా పదేళ్లలో రాష్ట్ర రుణం దాదాపు పదిరెట్లు పెరిగింది. నాటి పాలకుల తప్పుడు విధాన నిర్ణయాల కారణంగా సాగునీటి ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. కాల్వల ద్వారా నీటికి బదులు అవినీతి సొమ్మును ప్రవహింపజేయాలనే లక్ష్యంతోనే గత ప్రభుత్వం పనిచేసింది. అపరిష్కృత సాగునీటి సమస్యలు పరిష్కరించడంతోపాటు దిద్దుబాటు చర్యలతో మేలైన ప్రాజెక్టులను నిర్మించాలనే కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉంది.
-బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
TWM NEWS:తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్లో సంక్షేమం, వ్యవసాయ రంగాలకే రూ.1.10 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించి తమ ప్రాథమ్యాలను చాటింది. ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసింది. మొత్తంగా సంక్షేమం, సాగు రంగాలే గుండెగా 2024-25 బడ్జెట్ను గురువారం ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమ పథకాలకు రూ.63 వేల కోట్లు కేటాయించడం ద్వారా సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధే తమ లక్ష్యమని ప్రభుత్వం వివరించింది. ఇక ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన భరోసా ప్రకారం వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించింది. ఆరు గ్యారంటీల అమలుకు నిధుల కేటాయింపునూ సర్కారు ప్రాధాన్య అంశంగా చేపట్టింది. వీటికే ప్రత్యేకంగా రూ.47,167 కోట్లను ఇవ్వడం ఇందుకు నిదర్శనం. రాష్ట్ర ఆదాయానికి కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపైనా శ్రద్ధ చూపుతూ రూ.10 వేల కోట్లను ప్రత్యేకించింది. అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రధాన పథకాలకు నిధులు పెద్దమొత్తంలో దక్కాయి. రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కొత్త పాలసీలు తీసుకురానున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి గ్రామం నుంచి మండలానికి, అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు, అక్కడి నుంచి హైదరాబాద్కు 4 వరసల తారురోడ్లు నిర్మించేందుకుసమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు వివరించింది. మొత్తం అన్ని పథకాలకు కలిపి రూ. లక్షా 55 వేల కోట్లకుపైగా కేటాయించింది. ఈ పథకాల ద్వారా పేదలకు అధిక లబ్ధి చేకూరడమే కాకుండా అభివృద్ధి పరుగులు తీస్తుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.
వనరుల పరిమితులున్నా..
వనరుల పరిమితులున్నా.. రాష్ట్ర ఆదాయం రూ.2.90 లక్షల కోట్లకు పైగా సాధించాలని ప్రభుత్వం
బడ్జెట్లో లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ రాబడి లక్ష్యసాధనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్ని పథకాలకు కలిపి
రూ.2.91 లక్షల కోట్లకు పైగా ఖర్చుచేయాలని నిర్ణయించింది. గతేడాది శాసనసభ, పార్లమెంటు
ఎన్నికలున్నందున యంత్రాంగం దాదాపు ఐదారు నెలలు ఎన్నికల ప్రక్రియపై దృష్టి పెట్టడంతో
ఆదాయం పెద్దగా పెరగలేదని ఆర్థికశాఖ వివరించింది. సాధారణంగా ఒక ఏడాది ఆదాయం
పెద్దగా పెరగకపోతే.. మరుసటి సంవత్సరం భారీగా పెరగడం సహజమని అందుకే ఈ ఏడాది
పన్నుల ద్వారా ఆదాయంలో 24 శాతానికి పైగా వృద్ధిరేటు నమోదవుతుందని ఈ శాఖ ధీమా
వ్యక్తం చేస్తోంది. 2022-23లో పన్నుల ద్వారా రూ. లక్షా 6 వేల కోట్ల ఆదాయం రాగా..
గతేడాది (2023-24) బడ్జెట్లో తొలుత రూ. లక్షా 31 వేల కోట్లు దాటవచ్చని గత ప్రభుత్వం అంచనా
వేసింది. కానీ, ఎన్నికల హడావుడి కారణంగా ఆదాయం పెంపుపై దృష్టి పెట్టే అవకాశం
యంత్రాంగానికి లేకపోవడంతో చివరికి రూ. లక్షా 11 వేల కోట్లే వచ్చినట్లు సవరణ బడ్జెట్
తెలిపింది. ఈ సవరణ మొత్తం పై మరో 24 శాతం పెరిగి ఈ ఏడాది రూ. లక్షా 38 వేల కోట్లు
రావచ్చని తాజా బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసింది. గతేడాది పన్నుల ద్వారా ఆదాయం
వృద్ధిరేటు తక్కువగా ఉండటానికి ఎన్నికలే కారణమని, ఈ ఏడాది ఆ పరిస్థితి ఉండదని, ప్రభుత్వం
ప్రత్యేక శ్రద్ధతో వారం వారం సమీక్షలు జరిపి సంస్కరణలు తెస్తున్నందున 24 శాతం వృద్ధి
సాధిస్తామని ధీమా వ్యక్తంచేసింది. ఇక పన్నేతర ఆదాయం గతేడాది రూ.23,819 కోట్లు రాగా ఈ
ఏడాది రూ.35,208 కోట్లు వస్తుందని అంచనా వేసింది. రాష్ట్ర రెవెన్యూ రాబడి పద్దు కింద వచ్చే
మొత్తం రూ.2.21 లక్షల కోట్లలో... పన్నుల ద్వారా ఆదాయం రూ.1.38 లక్షల కోట్లు, పన్నేతర
ఆదాయం రూ.35,208 కోట్లు అత్యంత కీలకం. సంక్షేమ పథకాలకు ఈ నిధులు కీలకంగా
మారనున్నాయి. ఇక మద్యంపై ఎక్సైజ్ సుంకం పద్దు కింద వచ్చే ఆదాయం గతేడాదితో
పోలిస్తే రూ.20,298 కోట్ల నుంచి రూ.25,617 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. మద్యం
అమ్మకాలు భారీగా పెరిగేతేనే అదనంగా మరో రూ.5,319 కోట్ల ఆదాయం ఎక్సైజ్ సుంకం గా
వస్తుంది. మద్యం, పెట్రోలు, డీజిల్ అమ్మకాలు పెరిగితే వ్యాట్ కూడా రూ.33,449 కోట్లు వస్తుందని అంచనా.