Category : | Sub Category : అంతర్జాతీయ Posted on 2024-07-25 10:32:17
భారత్లోని ఉత్తర్ ప్రదేశ్లో నెలకొన్న కావడి యాత్ర వివాదంపై నేడు అమెరికా స్పందించింది..
TWM News : ఉత్తర్ ప్రదేశ్లో కావడి యాత్ర సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల విషయంలో నెలకొన్న వివాదంపై అమెరికా (USA) స్పందించింది. పాకిస్థాన్కు చెందిన ఓ విలేకరి నేడు 'కావడి యాత్ర' సందర్భంగా చెలరేగిన వివాదాన్ని అగ్రరాజ్య విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వద్ద లేవనెత్తాడు.
దీనిపై మిల్లర్ స్పందిస్తూ.. "ఆ పరిణామాలు అమెరికాకు తెలుసు. అదే సమయంలో భారత సుప్రీంకోర్టు జులై 22వ తేదీన యూపీ ప్రభుత్వ ఆదేశాలను నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఇచ్చిన విషయమూ మా దృష్టికి వచ్చింది. ప్రస్తుతం ఆ ఆదేశాలు నిలిచిపోయాయి. సాధారణంగా అమెరికా మత స్వేచ్ఛ హక్కును గౌరవించడాన్ని ప్రోత్సహిస్తుంది. అన్ని మతాలను గౌరవించే విషయంలో భారత్తో కలిసి పనిచేస్తుంది" అని మిల్లర్ పేర్కొన్నారు. భారత అంతర్గత విషయాలను పాకిస్థాన్కు చెందిన జర్నలిస్టులు తరచూ అమెరికా విదేశాంగ శాఖ వద్ద ప్రస్తావించి స్పందన కోరడం పరిపాటిగా మారింది.
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించేవారు తమ యజమానుల పేర్లను తప్పనిసరిగా ఆహారశాలలపై ప్రదర్శించాలన్న ఉత్తర్వులపై జులై 22న సుప్రీంకోర్టు స్టే విధించింది. విక్రయించేది శాకాహారమా, మాంసాహారమా అనేది ప్రదర్శిస్తే సరిపోతుందని, హోటల్ యజమానులు ఎవరు.. అందులో పనిచేసే వారెవరు అనే వివరాల కోసం బలవంతం చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది.