Category : | Sub Category : రాజకీయం Posted on 2024-07-24 09:16:15
రూ.10 లక్షలలోపు స్వదేశీ విద్యా రుణాలపై 3% వడ్డీ రాయితీ
వచ్చే రెండేళ్లలో కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహించనున్నాం. కూరగాయల ఉత్పత్తిని పెద్ద ఎత్తున చేపట్టేలా క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం. వివిధ రకాల నేలలకు అనువైన 32 ఉద్యాన పంటలకు సంబంధించి భిన్న వాతావరణ పరిస్థితులను సమర్థంగా తట్టుకొని అత్యధిక ఫలసాయాన్ని అందించే 109 రకాల విత్తనాలను ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది.
-కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
TWM NEWS:పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతి.. వికసిత భారత్ లక్ష్యాలుగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూ.48.20 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ప్రోత్సహించేలా.. దానిని ఎంచుకున్న వారికి మాత్రం కాస్త ఊరట కల్పించారు. పాత విధానంలో ఉన్నవారికి ముఖం చాటేశారు. తగినంత ఉపాధి అవకాశాలు కల్పించలేదన్న కోపంతో గత ఎన్నికల్లో యువత భాజపాకు దూరమైందన్న విషయాన్ని గ్రహించిన ఆర్థికమంత్రి ఈసారి ఆ లోటును భర్తీచేసే ప్రయత్నం చేశారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రాధాన్యమిచ్చారు. ఎంఎస్ఎంఈ రంగానికి ప్రోత్సాహకాలు ప్రకటించి ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు బాటలు వేశారు. ప్రైవేటు సంస్థలు కొత్తగా ఉద్యోగాలు కల్పించినప్పుడు వారికి తొలినెల జీతం తామే చెల్లిస్తామని ప్రకటించి కొత్త సంప్రదాయానికి తెరతీశారు. రైతులపై పెట్టుబడి భారం తగ్గించే ఉద్దేశంతో కోటిమంది రైతులను ప్రకృతి సాగువైపు మళ్లించాలని నిర్ణయించారు. వీరికి చేయూతనివ్వడానికి 10 వేల జీవ ఎరువుల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. బంగారం, మొబైళ్లపై సుంకాలు తగ్గిస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా తొమ్మిది ప్రాధాన్య అంశాలను మంగళవారం పార్లమెంటు ముందుంచారు. ఆమెకు ఇది వరసగా ఏడో బడ్జెట్.