అల్లర్లతో బంగ్లాదేశ్లో కర్ఫ్యూ.. సరిహద్దులు దాటి స్వదేశానికి భారతీయులు...
Category : |
Sub Category : బ్రేకింగ్ వార్తలు Posted on 2024-07-20 10:09:45
TWM NEWS:ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల (Quota System) విధానాన్ని సంస్కరించి.. ప్రతిభకు పట్టం కట్టాలని డిమాండు చేస్తూ బంగ్లాదేశ్ (Bangladesh violence) లోని విశ్వవిద్యాలయాల్లో గత కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇవి కాస్తా హింసాత్మకంగా మారి ఇప్పటివరకు 105 మంది మృతిచెందినట్లు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి భారతీయులు (Indians) స్వదేశానికి తిరిగొస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 450 మంది భారత పౌరులు సరిహద్దు దాటి మేఘాలయ చేరుకున్నట్లు అధికారులు శనివారం వెల్లడించారు.
భారతీయులతో పాటు నేపాల్, భూటాన్కు చెందిన దాదాపు 600 మందికి పైగా విద్యార్థులు ఆశ్రయం కోసం మేఘాలయ చేరుకున్నట్లు ఆ రాష్ట్ర హోంశాఖ అధికారులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 245 మంది భారతీయులతో పాటు 13 మంది నేపాలీ విద్యార్థులు సరిహద్దులు దాటారు. శనివారం తెల్లవారుజాము వరకు మరో 363 మంది మేఘాలయకు వచ్చారు. వీరిలో 204 మంది భారతీయులు, 158 మంది నేపాలీ విద్యార్థులు, ఒక భూటాన్ వ్యక్తి ఉన్నారు. స్వదేశానికి తిరిగొచ్చిన భారతీయుల్లో ఎక్కువ మంది వైద్య విద్యార్థులే ఉన్నారు. వీరిని ఉత్తర్ ప్రదేశ్, హరియాణా, మేఘాలయ, జమ్మూకశ్మీర్కు చెందినవారిగా గుర్తించారు.