Category : | Sub Category : క్రీడా Posted on 2024-07-15 11:16:15
ప్రపంచ క్రికెట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. రెండేసిసార్లు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గింది. అయితే, ఒక్క కప్ మాత్రం అందడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. ప్రపంచకప్ అనగానే ఏదో తెలియని ఉద్వేగం. ఎందుకంటే మనకు దక్కిన నాలుగు కప్పులు అంత తేలిగ్గా ఏం రాలేదు. ఎన్నో ఏళ్ల విరామం.. మరెంతో నిరీక్షణ తర్వాత ఈ ట్రోఫీలు భారత్ దరిచేరాయి. తాజాగా టీ20 ప్రపంచకప్ విజయంతో భారత్ జెర్సీపై మరో స్టార్ వచ్చి చేరింది.ఇప్పుడ టీమ్ ఇండియా ఖాతాలో రెండు వన్డే ప్రపంచకప్లు.. మరో రెండు టీ20 ప్రపంచకప్లు ఉన్నాయి. ఒక ఛాంపియన్స్ ట్రోఫీ కూడా మనోళ్లు కైసవం చేసుకున్నారు. కానీ ఏదో వెలితి.. ఒక్కటి తక్కువైంది. అదే ఐసీసీ టెస్టు ప్రపంచ ఛాంపియన్షిప్! కోచ్గాచివరి మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్ ద్రావిడ్ సైతం విరాట్ కోహ్లితో ఇదేమాట అన్నాడు. తెల్ల బంతి ఫార్మాట్లోమూడు కప్పులు (వన్డే, టీ20, ఛాంపియన్స్ ట్రోఫీ) ఇక మిగిలింది రెడ్ (ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్)అని! అంటే ఇప్పుడు మొదలు కావాల్సింది మిషన్ టెస్టు ఛాంపియన్షిప్!అందినట్టే అంది..
2011లో చివరిగా భారత్ వన్డే ప్రపంచకప్ రూపంలో ఓ ఐసీసీ టోర్నీలో గెలిచింది. తర్వాత మరో ట్రోఫీ కోసం ఏకంగా దశాబ్దానికి పైగా నిరీక్షించింది. ఎట్టకేలకు టీ20 కప్ రూపంలో ఈ ఎదురుచూపులకు తెరపడింది.కానీ ఈ క్రమంలో ఎన్నో కప్పులు టీమిండియా చేజారాయి. ముఖ్యంగా రెండుసార్లు టెస్టుల్లో ప్రపంచ ఛాంపియన్ అయ్యే అవకాశాన్ని భారత్ జారవిడిచింది. 2021 ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ చక్రంలో భారత్ గొప్పగా ఆడింది. అదిరే ప్రదర్శనలతో ఫైనల్కు దూసుకొచ్చింది. న్యూజిలాండ్ తుదిపోరులో టీమ్ ఇండియా గట్టిగానే పోరాడింది. కానీ రెండో ఇన్నింగ్స్ తడబడి కివీస్కు అవకాశం ఇచ్చింది. ఫలితం.. భారత్కు కప్ చేజారింది. రెడ్ బాల్ ఫార్మాట్లో తొలి దెబ్బ తగిలింది అప్పుడే. కానీ వెంటనే పుంజుకుని 2021-2023 టెస్టు ఛాంపియన్షిప్ చక్రంలోనూ టీమిండియా ఫైనల్కు అర్హత సాధించింది. ఈసారి ఎదురైంది. కఠినమైన ఆస్ట్రేలియా! ఆసీస్ అనగానే ముందే తెచ్చుకున్న గుబులు వల్లో భారత్ తన జోరుప్రదర్శించలేకపోయింది. తొలి ఇన్నింగ్స్లో ప్రత్యర్థికి ఎక్కువ స్కోరు సమర్పించేసుకుంది.
మ్యాచ్లో ఇదే పెద్ద మలుపు. ఆ తర్వాత కోలుకోలేకపోయింది. ట్రావిస్ హెడ్ తొలిసారి భారత్కు సైంధవుడిగా మారింది ఈ మ్యాచ్లోనే. భారత బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొన్న అతడు జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఆ తర్వాత బ్యాటింగ్లో రెండు ఇన్నింగ్స్ ల్లో తడబడిన రోహిత్ సేన తేలిగ్గా ప్రత్యర్థికి తలొంచింది. ఈ ఫార్మాట్లో కప్ మరోసారి అందకుండాపోయింది.ప్రపంచకప్ స్పూర్తితో........
ఐసీసీ టోర్నీల్లో వరుస వైఫల్యాలతో ఇన్నాళ్లూ టీమ్ ఇండియాలో తెలియని వేదన కనిపించేంది. కానీ టీ20 ప్రపంచకప్ విజయంతో రోహిత్ సేనలో జోష్ పెరిగింది. కుర్రాళ్లకు ఊపు వచ్చింది. ఇక తదుపరి లక్ష్యం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్పే. ఈ ఏడాది
భారత్ 15-16 టెస్టులు ఆడబోతోంది. టీ20లకు గుడ్బై చెప్పిన రోహిత్, కోహ్లి, జడేజా సుదీర్ఘ ఫార్మాట్లో అందుబాటులో ఉంటారు.వారు మరింత తాజాగా టెస్టులు ఆడే నేపథ్యంలో జట్టు మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అభిమానులు -ఆశిస్తున్నారు.
ప్రపంచకప్ ఇచ్చిన స్ఫూర్తితో జట్టు చెలరేగాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఫైనల్ ఫోబియాను ఇకనైనా వదిలిపెట్టాలని...ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్లను మాత్రం అసలు వదల కూడదని అంటున్నారు. అలా జరిగితే రాహుల్ ద్రావిడ్ అన్న అన్ని టిక్లు భారత్ పూర్తి చేసేసినట్టే. కానీ అలా జరగాలంటే బ్యాటింగ్లో తడబాటును విడిచిపెట్టాలి. ఏ సెషనన్నూ తేలిగ్గా తీసుకోకూడదు. టీ20 ప్రపంచకప్ లో ఆశలు లేని చోట నుంచి అద్భుతం చేసినట్టుగా పట్టుదలగా ఆడాలి. అప్పుడే టెస్టుల్లోనూ ప్రపంచ ఛాంపియన్ అయ్యే అవకాశం ఉంటుంది.