Category : | Sub Category : రాజకీయం Posted on 2024-07-13 16:41:36
TWM News : మంచి చేయాలనుకునేవారికి ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవని సీఎం చంద్రబాబు తెలిపారు. గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంతశేష స్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... మంచి చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్ చిరునామాగా ఉంటుంది. మంచి చేసే వారంతా ఏపీలో ఇక ముందుకు రావాలి. అక్షయపాత్ర స్ఫూర్తితో అతి త్వరలో అన్న క్యాంటీన్లను పునఃప్రారంభిస్తాం. హరేకృష్ణ సంస్థ దైవసేవతో పాటు మానవ సేవను సమానంగా చేస్తోంది. ఆధ్యాత్మికత ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకెళ్లలేం.
దైవత్వాన్ని అందరిలో పెంపొందించేలా అక్షయ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధుపండిత్ కృషి చేస్తున్నారు. 50 మంది ఐఐటీ పట్టభద్రులు సేవా కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయం. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే ఆధ్యాత్మిక సేవలనూ కొనసాగించాలి. వేంకటేశ్వరస్వామి దయతోనే బాంబు పేలుళ్ల నుంచి బయటపడ్డా. ప్రపంచానికి సేవలందించే అవకాశం కోసమే నాకు తిరిగి ప్రాణభిక్ష పెట్టారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే అందరి నినాదం కావాలి. అక్షయపాత్ర ద్వారా ప్రతిరోజు 22 లక్షల మందికి భోజనం పెడుతున్నారు. అన్న క్యాంటీన్లను చిన్న ఫిర్యాదు లేకుండా అక్షయపాత్ర నిర్వహించింది అని చంద్రబాబు తెలిపారు.
హరేకృష్ణ సంస్థకు రూ.3 కోట్లు విరాళం...
హరేకృష్ణ సంస్థకు అన్నదానానికి దాతలు రూ.3 కోట్లు విరాళం ప్రకటించారు. పారిశ్రామికవేత్త పెనుమత్స శ్రీనివాస్ రాజు రూ.కోటి విరాళం అందజేశారు. పూర్ టు రిచ్ స్ఫూర్తితో వంద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు చెప్పారు. హరేకృష్ణ సంస్థకు సక్కు గ్రూపు రూ.కోటి విరాళం, యలమంచిలి కృష్ణమోహన్ గ్రూపు రూ.కోటి విరాళం అందించాయి. శ్రీనివాస్ రాజు, కృష్ణమోహన్, సక్కు గ్రూప్ను సీఎం చంద్రబాబు అభినందించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక భూముల ధరలు పెరిగాయని తెలిపారు.