Category : | Sub Category : క్రైమ్ Posted on 2024-07-10 13:29:07
లఖ్నవూ: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. ఉన్నావ్ వద్ద పాల ట్యాంకర్ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొన్న ఘటనలో 18 మంది మృతి చెందగా, 19 మంది గాయపడ్డారు. ఉదయం 5.15 గంటలకు లఖ్నవూ- ఆగ్రా ఎక్స్ప్రెస్వేపై ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. డబుల్ డెక్కర్ బస్సు బిహార్ నుంచి దిల్లీకి వెళ్తున్నట్లు గుర్తించారు. ఉన్నావ్ సమీపంలో పాల ట్యాంకర్ను వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. దాంతో బస్సు ముందుభాగం ధ్వంసమైంది. అతివేగం కారణంగా బస్సులోని వారు బయటకు ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు.
ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, అతివేగమే కారణమని ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే గాయపడినవారికి తగిన వైద్య చికిత్స అందేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. క్షతగాత్రులకు బగారా మావ్ సీహెచ్సీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.