Category : | Sub Category : రాజకీయం Posted on 2024-06-19 11:09:30
TWM News : ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నానికే మీరు హుందాతనం తెచ్చారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఆయన మంగళవారం రాష్ట్ర సచివాలయానికి వచ్చారు. మొదటి బ్లాక్ లోని ముఖ్యమంత్రి చంద్రబాబు ఛాంబర్కు వెళ్లి భేటీ అయ్యారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మొదటిసారి తన ఛాంబర్కు వచ్చిన పవన్ కల్యాణ్ను చంద్రబాబు సీటులోంచి లేచి ఎదురెళ్లి ఆలింగనం చేసుకుని సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఛాంబర్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని చూపించి.. ఆ గుర్తుకే హుందాతనం తెచ్చారని చంద్రబాబును పవన్ కొనియాడారు. దీనికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. భేటీ దాదాపుగా గంటన్నరసేపు కొనసాగింది. ఇందులో దాదాపు 45 నిమిషాల పాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. నేతలిద్దరూ తాజా రాజకీయాలతో పాటు వివిధ అంశాలపై చర్చించినట్టు తెలిసింది. పవన్ కల్యాణ్ తోపాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ సీఎంను కలిశారు.
సచివాలయమంతా సందడి...
పవన్ కల్యాణ్ రాకను పురస్కరించుకుని సచివాలయమంతా మంగళవారం సందడి నెలకొంది. సచివాలయ ఉద్యోగులే కాకుండా బయటి ప్రాంతానికి చెందిన వివిధ శాఖల ఉద్యోగులు కూడా సచివాలయానికి భారీగా వచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు కేటాయించిన రెండో బ్లాక్ కు మధ్యాహ్నం 1 గంట నుంచే ఉద్యోగులు వరుస కట్టారు. 3 గంటల సమయానికి బ్లాక్ మొత్తం ఉద్యోగులతో నిండిపోయింది. దాదాపుగా 3.47 గంటల సమయానికి సచివాలయ ఆవరణలోకి వచ్చిన పవన్ కు నాలుగు బ్లాక్ ల నుంచి ఉద్యోగులు బయటి వచ్చి స్వాగతం పలికారు. ఆయన వాహనంపై అభివాదం చేస్తూ ముందుకు సాగుతుండగా సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. జై పవన్, జై జనసేన నినాదాలతో హోరెత్తించారు.
ఛాంబర్ను పరిశీలించకుండానే సీఎం వద్దకు...
రాజధాని ప్రాంతం నుంచి పవన్ కల్యాణ్ కాన్వాయ్ సచివాలయంలోకి ప్రవేశించే సమయంలో వాహనాల వెంట సాధారణ ప్రజలు, అభిమానులు, ఉద్యోగులూ లోపలికి వచ్చేశారు. కాన్వాయ్ రెండో బ్లాక్ వద్దకు చేరుకునే సమయానికి బ్లాక్ మొత్తం ఉద్యోగులతో కిక్కిరిసిపోయింది. పోలీసులు వారిని కట్టడి చేయలేక చేతులెత్తేశారు. దీంతో పవన్ కాసేపు రెండో బ్లాక్ వద్దే వాహనంలో ఉండిపోయారు. ఆ తర్వాత ఛాంబర్ను పరిశీలించకుండానే కాన్వాయ్ను వెనక్కి తిప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండే ఒకటో బ్లాక్ లోకి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ, తెదేపా నేత వర్మ కాలినడకనే రెండో బ్లాక్ నుంచి ఒకటో బ్లాక్ కు వెళ్లారు. చంద్రబాబు, పవన్ల భేటీ ముగిసే వరకు ఉద్యోగులు సచివాలయ ఆవరణలోనే వేచి ఉన్నారు. భేటీ ముగిసిన తర్వాత తనకు కేటాయించిన ఛాంబర్ను పరిశీలించకుండానే పవన్ కల్యాణ్ వెళ్లిపోయారు.
సచివాలయానికి వచ్చిన కేరళ ఐఏఎస్ అధికారి కృష్ణతేజ...
కేరళలోని త్రిసూర్ జిల్లా కలెక్టర్గా పని చేస్తున్న ఐఏఎస్ అధికారి ఎం.వి.ఆర్. కృష్ణతేజ మంగళవారం వెలగపూడి సచివాలయానికి వచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు కేటాయించిన రెండో బ్లాక్ లోని ఛాంబర్కు చేరుకుని కాసేపు అక్కడే వేచి ఉన్నారు. ఒకటో బ్లాక్ లోని ముఖ్యమంత్రి చంద్రబాబు ఛాంబర్కు వెళ్లి పవన్ కల్యాణ్ భేటీ అయిన కాసేపటి తర్వాత కృష్ణతేజ కూడా ఆ బ్లాక్ లోపలికి వెళ్లారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ ప్రస్తుతం కేరళలో పనిచేస్తున్నారు. ఆ రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి విశేష కృషి చేశారు. కృష్ణతేజ జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఎంపిక కావడంపై పవన కల్యాణ్ ఇటీవల ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. తాజాగా ఆయన సచివాలయానికి రావడంతో డిప్యుటేషన్పై రాష్ట్రానికి వస్తారనే చర్చ నడుస్తోంది.