Category : | Sub Category : రాజకీయం Posted on 2024-03-15 11:08:51
TWM News : ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో మొన్న ఎం సి హెచ్ ఆర్ డి లో సీఎం రేవంత్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న అంశాలపై చర్చించిన సీఎం ప్రధానంగా జీవో 317 వల్ల ఎదుర్కొంటున్న సమస్యలపై క్యాబినెట్ సబ్ కమిటీతో చర్చలు నిర్వహించి ప్రభుత్వానికి తగు సిఫార్సు చేయాలని సూచించారు. గతంలో జరిగిన సబ్ కమిటీ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెండు జీవోల వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కుంటున్న సమస్యల గురించి అధికారులు మంత్రులకు వివరించారు. దీంతో మరోసారి సమావేశానికి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఉద్యోగులు, తమ అభిప్రాయాలు కమిటీకి చెప్పుకునేందుకు అవకాశం కల్పించారు. అందులో భాగంగానే ఇవాళ సబ్ కమిటీ మరోసారి భేటీ అయింది.
అయితే క్యాబినెట్ సబ్ కమిటీకి ఉద్యోగులు 317 జీవో కి సంబంధించి తమ సమస్యలను డ్రాఫ్ట్ చేసి సమర్పిస్తే ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అందుకు అనుగుణంగా సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీ జీవో 317 తో పాటు జీవో 46 కి సంబంధించిన సమస్యలపై ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఉద్యోగ నియామకల్లో స్థానికత అనేది చాలా ముఖ్యమైనదని.. అసలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది స్థానికత అన్న అంశంపై అని క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ రాజు నరసింహ ఉద్యోగ సంఘాలకు తెలిపారు. జిల్లాల పునర్ విభజన సందర్భంగా సీనియారిటీ ఆధారంగా అభ్యర్థులను కొత్తగా ఏర్పడిన ఇతర జిల్లాలకు కేటాయించడంతో కొత్త జిల్లాల్లో వాళ్ళ సీనియారిటీ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. అది వారికి బాగా నష్టం కలిగిస్తోంది. కొత్త జిల్లాలోకి కేటాయించడంతో శాశ్వతంగా వాళ్ళ అక్కడే ఉండాల్సి రావడం ఉమ్మడి జిల్లాకి తిరిగి వచ్చే అవకాశం లేకపోవడం కుటుంబాలకు దూరంగా ఉండటంతో భార్యాభర్తలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఇద్దరు భార్యాభర్తలు రెండు వేరువేరు ప్రదేశాల్లో వందల కిలోమీటర్ల దూరంలో ఉండి ఉద్యోగాలు చేయడంతో పిల్లల పరంగా వారు ఏర్పరుచుకున్న స్థిరనివాసాల పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. అస్తవ్యస్తంగా ఏర్పాటు చేసిన జీవో 317, అప్పటి ఎంప్లాయిస్ యూనియన్ లు స్వలాభం కోసం ప్రభుత్వానికి వత్తాసు పలకడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి. వెంటనే సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు జీవో 317 బాధితులు. దీనికి సంబంధించి దామోదర్ రాజనర్సింహ సంఘాలను సూచనలు అడగ్గా ఇతర ప్రదేశంలో ఉద్యోగాలు చేస్తున్న వారిలో స్పౌజ్ బదిలీలు, ఒంటరిగా ఉద్యోగం చేస్తున్న వారు, మహిళలు, వికలాంగులు బదిలీల్లో మొదటి ప్రాధాన్యత కల్పించి పరిష్కరించాలని కోరారు. పోస్టులు తక్కువ ఉన్న దగ్గర సూపర్ న్యుమరి పోస్టులను క్రియేట్ చేయడం ద్వారా సమస్యను దాదాపు పరిష్కరించవచ్చని సూచించారు.
ఇక జీవో 46 కి సంబంధించి గతంలో రాష్ట్రాన్ని మల్టీజ్జోన్గా పరిగణించి నియామకాలు చేపట్టేది. జీవో 46 ద్వారా జిల్లాల వారీగా జోన్లను లను విభజించడంతో తమకు అవకాశాలు రావట్లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవో 46 అనేది అన్ని ఉద్యోగ నియామకాలకు వర్తించినప్పటికీ ఎక్కువగా నష్టపోయింది మాత్రం పోలీసులునియామకానికి ఎంపికైన అభ్యర్థులు. జీవో 317 వల్ల అత్యధికంగా ఉపాధ్యాయులు నష్టపోతే జీవో 46 వల్ల పోలీస్ నియామకాలకు అప్లై చేసినవాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇదివరకు రాష్ట్ర మొత్తాన్ని ఒకే జోన్‌గా విభజించడంతో మెరిట్ ఆధారంగా రాష్ట్రంలో ఎక్కడైనా ఉద్యోగం పొందే అవకాశం ఉండేది. కానీ 46 జిల్లాలకు పరిమితం కావడంతో అత్యధికంగా పోలీస్ రిక్రూట్మెంట్ జరిగే హైదరాబాద్ పరిధిలో దాదాపు 50 శాతానికి పైగా హైదరాబాద్ స్థానికత వారికే అవకాశం రావడం మిగిలిన 40, 50 శాతం అన్ని జిల్లాలకు ఉండటంతో జిల్లాలు గ్రామీణ ప్రాంతాల్లో పుట్టడమే మేము చేసిన తప్ప అంటూ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నుంచి సిఫార్సులను తీసుకొని ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించిన తర్వాత ప్రభుత్వం అందుకు అనుగుణంగా నిర్ణయం ప్రకటిస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. జీవో 317ని సవరించాలంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అయిన జీవో126 ని కేంద్రం సవరించాల్సి ఉండటంతో ప్రభుత్వమే జీవో 317 కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని చూస్తోంది.