Category : | Sub Category : రాజకీయం Posted on 2024-03-15 10:58:47
TWM News : తిరుపతిలో పొత్తుల పేచీ పొలిటికల్ హీట్ పెంచింది. టిడిపి-జనసేన బిజెపి పొత్తు వ్యవహరం తిరుపతిలో బెడిసి కొడుతోంది. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ జనసేనకు కేటాయింపుపై అసంతృప్తిగా ఉన్న టిడిపి కేడర్ ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులును బరిలో దింపాలన్న జనసేన ఆలోచనపై మండిపడుతోంది. నాన్ లోకల్‌కు సహకరించేది లేదంటూ లోకల్ లీడర్స్ ఆత్మగౌరవ సభకు సిద్ధమవుతున్నారు. మరోవైపు గో బ్యాక్ అరణి శ్రీనివాసులు అంటూ వెలసిన ఫ్లెక్సీల వ్యవహారం చర్చగా మారింది.
తిరుపతి అసెంబ్లీ టికెట్ వ్యవహారం హాట్ హాట్‌గా మారింది. చిత్తూరు అసెంబ్లీ టికెట్ కోసం టిడిపి, జనసేన, బిజెపి మూడు పార్టీల నుంచి పోటీ తీవ్రంగానే ఉంది. తిరుపతిలో పోటీ చేసే అవకాశం జనసేనకు దక్కింది. ఇదంతా ఒక ఎత్తైతే అభ్యర్థి విషయం మరో కొత్త వివాదానికి తెర తీసింది. తిరుపతి నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠకు తెర తీసిన జనసేన చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులుకు అవకాశం ఇచ్చింది. చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అరణి శ్రీనివాసులు ఈ మధ్యనే వైసీపీని వీడి జనసేనలో చేరగా తిరుపతి టికెట్ ఆయన్ని వరించింది. అనుహ్యంగా అరణి శ్రీనివాసులుకు తిరుపతి అసెంబ్లీ టికెట్ కేటాయించడంపై టిడిపి – జనసేనలో అసంతృప్తి భగ్గుమంది. ప్రత్యేకించి బలిజ సామాజిక వర్గం నేతల నుంచి అసహనం వ్యక్తమవుతోంది.
తిరుపతి టిడిపి టికెట్‌ను అరడజను మంది ఆశిస్తే జనసేన నుంచి ఇద్దరు ఆశావాహులు టికెట్ కోసం పోటీ పడ్డారు. అయితే తిరుపతి సీటును జనసేనకు ఇవ్వాల్సి రావడంతో టిడిపి హైకమాండ్ ఆ పార్టీ ఆశావాహులకు నో చెప్పింది. జనసేన అభ్యర్థిని గెలిపించేందుకు పని చేయాలని ఆదేశించింది. అయితే హై కమాండ్ తీసుకున్న నిర్ణయం ఆదేశించిన ఆజ్ఞను భేఖాతరు చేసేలా టిడిపి నేతలు వ్యవహరించగా.. టిడిపి శ్రేణులలోనూ భిన్నాభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి తిరుపతి ఎన్నికల్లో కనిపించిన సైకిల్ సింబల్ ఈ ఎన్నికల్లో కనిపించదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్న టిడిపి శ్రేణులు ఉమ్మడి అభ్యర్థికి సహకరించే పరిస్థితి లేదన్న సంకేతాలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి అసెంబ్లీ సీటును ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులుకు కేటాయించడాన్ని తప్పు పడుతున్నారు టిడిపి – జనసేన స్థానిక నాయకులు.
పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే స్థానిక టిడిపి – జనసేన నేతలకు టికెట్ కేటాయించాలన్న డిమాండ్‌ను వినిపిస్తున్నారు. జనసేన అధిష్టానం దీనిపై స్పందించకుంటే ఇండిపెండెంట్‌గానైనా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే తిరుపతిలో ఒక ప్రైవేట్ హోటల్లో టిడిపి – జనసేన నేతల సమావేశం నిర్వహించారు. తిరుపతి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థిగా స్థానిక నేతలకే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులుకు టికెట్ ఇస్తే సహకరించకూడదన్న అభిప్రాయానికి వచ్చారు. పవన్ కాకుండా ఇతరులకు ఛాన్స్ ఇస్తే స్థానికుల్లో ఒకరికి అవకాశం ఇవ్వాలని ప్రధాన డిమాండ్‌కు కట్టుబడి ఉండాలని నిర్ణయించారు. దీంతో టిడిపి – జనసేన నేతల సమావేశంపై పార్టీ అధిష్టానాలు కూడా ఫోకస్ చేయగా మరో వైపు లోకల్ నాన్ లోకల్ అంశాన్ని కూడా తెరమీదకు తెచ్చారు. నాన్ లోకల్ లీడర్‌కు తిరుపతి నుంచి పోటీచేస్తే అంగీకరించబోమంటున్న నేతలు ఆత్మగౌరవ సభకు సిద్ధమవుతున్నారు. ఇక తిరుపతిలోని ప్రధాన కూడళ్ళలో గో బ్యాక్ అరణి శ్రీనివాసులు అంటూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను స్థానికులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నుంచి ఎంపికైన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు తిరుపతికి రాకముందే అక్కడ పరిస్థితి కాకరేగుతోంది.