Category : | Sub Category : రాజకీయం Posted on 2024-02-28 12:48:49
TWM News : ఒంగోలు ఎంపీ, మాగుంట శ్రీనివాసులురెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో గౌరవం లేకపోవడం వల్ల పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఒంగోలులో ప్రకటించారు. పార్టీకి రాజీనామా చేయడం బాధాకరంగా ఉందన్నారు. తనకు ఈగోలు, అహం లేవని, ఉన్నది కేవలం ఆత్మగౌరవం మాత్రమేనని, దాన్ని కాపాడుకునేందుకు వైసీపీని వీడుతున్నట్టు ఎంపీ మాగుంట తెలిపారు.
ఎంపీ పదవీకాలం ముగిసిపోయినందున ఆ పదవికి రాజీనామా చేయడం లాంఛనమే అన్నారు. ఏ పార్టీలో చేరతామన్నది తరువాత చెబుతామని తెలిపారు. ప్రస్తుతానికి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ ఐదేళ్ళ కాలంలో తనకు సహకరించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇతర వైసీపీ పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఎంపీ మాగుంట పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించిన కొద్దిసేపటికే మాగుంట కార్యాలయంపై ఎగురుతున్న వైసీపీ జెండాను కార్యాలయం సిబ్బంది తొలగించారు.
ఒంగోలులో మాగుంట కుటుంబం 1991 నుంచి 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నామని రాజీనామా చేసే ముందు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి భావోద్వేగంతో మాట్లాడారు. తమ కుటుంబ సభ్యులు 8 సార్లు పార్లమెంటుకు, రెండుసార్లు అసెంబ్లీకి, ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేశామన్నారు. మాగుంట అంటే ఒక బ్రాండ్ అని అభిమానులు చెబుతారన్నారు. మాకు ఈగో లేదు, అహం లేదు, ఆత్మగౌరవం మాత్రమే ఉందన్నారు. గౌరవం కోసమే రాజకీయాలు చేస్తున్నామని, ఆ గౌరవం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నామన్నారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని రానున్న ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుత రాజకీయాలు చాలా బాధాకరంగా ఉన్నాయని, తన ఆత్మగౌరానికి సంబంధించిన విషయం కాబట్టి రాజీనామా చేయక తప్పడం లేదన్నారు.
సీఎం పర్యటనకు మాగుంటకు ఆహ్వానం అందకపోవడంతో తీవ్ర మనస్థాపంతో ఒంగోలులో జరిగిన సీఎం వైఎస్ జగన్ పర్యటనకు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి దూరంగా ఉన్నారు. నగరంలో ఇళ్ళు లేని 21 వేల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు పంపిణీ చేసేందుకు సీఎం వైఎస్ జగన్ ఫిబ్రవరి 23న ఒంగోలుకు వచ్చారు. సీఎం పర్యటనలో ఎంపీ మాగుంటకు ఆహ్వానం ఆందలేదు. మరోవైపు ఒంగోలు పార్లమెంట్ వైసీపీ ఇన్‌చార్జి చెవిరెడ్డి బాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డితో పాటు ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సీఎం సభలో పాల్గొన్నారు.
అయితే మాగుంటకు ఈసారి వైసీపీ టికెట్ లేదని ఆ పార్టీ అధిష్టానం తేల్చి చెప్పిన నేపధ్యంలో ఆయనకు ఆహ్వానం అందకపోవడం వైసీపీలో తీవ్ర చర్చ నడిచింది. కనీసం సీఎం పర్యటనలోనైనా ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం అందుతుందని భావించారు మాగుంట. అయితే అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో మాగుంట ఒంగోలుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో సీఎం పర్యటనకు మాగుంట దూరంగా ఉండిపోయారు.
దాదాపుగా రెండు నెలల క్రితమే వైసీపీ సిట్టింగ్ ఎంపీ మాగుంటకు తిరిగి టికెట్ ఇచ్చేదీ లేదని అధిష్టానం తేల్చి చెప్పడంతో ఆయనకు సీటు తిరిగి ఇవ్వాలని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి నెలరోజులపాటు అధిష్టానంతో పోరాటం చేశారు. అయితే సీఎ: వైఎస్ జగన్ స్వయంగా బాలినేనితో మాట్లాడిన తరువాత బాలినేని మెత్తపడ్డారు. ఈ పరిస్థితుల్లో మాగుంట టీడీపీతో టచ్‌లో ఉన్నారని ప్రచారం జరిగింది. ఒకవైపు వైసీపీలో టికెట్ లేకపోవడం, మరోవైపు తెలుగుదేశం పార్టీతో మాగుంట టచ్‌లో ఉన్నారన్న ప్రచారంతో ఒంగోలులో జరిగిన సీఎం పర్యటనకు స్థానిక సిట్టింగ్ ఎంపీ మాగుంటకు ఆహ్వానం అందలేదు. ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగానే అధికారులు కూడా ప్రోటోకాల్‌ను కూడా పక్కన పెట్టి ఎంపీ మాగుంటకు ఆహ్వానం పంపలేదని తెలుస్తోంది.
సీఎం జగన్ ఒంగోలు పర్యటనకు ఆహ్వానం అందని నేపధ్యంలో ఎంపీ మాగుంట టీడీపీకి లేదా, బిజెపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్టు ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాగుంట పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు టీడీపీ – జనసే కూటమిలో బీజేపీ చేరితే జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ నుంచి ఒంగోలు ఎంపీగా మాగుంట పోటీ చేస్తే బాగుంటుందని ఆయన అనుచరులు సూచిస్తున్నారట. ఒకవేళ టీడీపీ – జనసే కూటమిలో బీజేపీ లేకపోతే టీడీపీ నుంచే ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు మాగుంట సన్నాహాలు చేసుకుంటున్నట్టు చెబుతున్నారు.
ఏదిఏమైనా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీ మారే విషయం స్పష్టమైంది. ఈసారి టీడీపీ లేదా బీజేపీ నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఎన్నికల్లో పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారు.