Category : | Sub Category : సైన్స్ Posted on 2024-02-26 12:09:22
TWM News : విశాఖలో నిర్మించిన స్టేట్ ఫుడ్ టెస్టింగ్ లేబరేటరీని జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. నాలుగున్నర కోట్ల CSS నిధులతో ఏర్పాటు చేసిన ప్రయోగశాలను వర్చువల్‌గా ప్రారంభించారు మోదీ.
ఎన్నికల వేళ ఆంధ్రాలో స్పెషల్ ఫోకస్ పెట్టారు ప్రధాని మోదీ. దానిలో భాగంగా.. మంగళగిరితో పాటు దేశంలోని ఐదు ఎయిమ్స్ విద్యా సంస్థలను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ నుంచి వర్చువల్‌గా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ క్రమంలోనే.. విశాఖపట్నంలో పెదవాల్తేరు ENT ఆస్పత్రి ప్రాంగణంలోని ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాలలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ టెస్టింగ్ ల్యాబరేటరీ ప్రారంభోత్సవం నిర్వహించారు. కేంద్ర ప్రాయోజిత పథకం నిధులతో మొత్తం రూ.4.77 కోట్లతో ఈ ప్రయోగశాలను నిర్మించారు. విశాఖ స్టేట్ ఫుడ్ టెస్టింగ్ లేబరేటరీని గుజరాత్‌లోని రాజ్ కోట్ నుంచి వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.
ఈ సందర్బంగా.. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాల్ని అమలు చేస్తున్నామన్నారు ప్రధాని మోదీ. వివిధ రాష్ట్రాల్లోని పలు కార్యక్రమాలతో పాటు ఇటీవల విశాఖలో ఐఐఎం, కడప, మంగళగిరి ప్రాంతాల్లో ఎయిమ్స్, విశాఖలో ఆహార ప్రయోగశాల వంటివి ప్రారంభించుకోవడం జరిగిందని చెప్పారు. వర్చువల్ విధానంలో జరిగిన ప్రారంభోత్సవానికి విశాఖ నుండి కలెక్టర్ మల్లిఖార్జున భాగస్వాములై జ్యోతి ప్రజ్వలన చేసి బటన్ నొక్కారు. ఈ ల్యాబ్ రాష్ట్రానికే గుండె లాంటిదని కొనియాడారు.
దీని ద్వారా.. విశాఖతో పాటు పలు ముఖ్య పట్టణాల్లో డయేరియా, ఇతర సమస్యలు వచ్చినపుడు ఆహరం, మంచినీటి నమూనాలను సేకరించి, ఎక్కువ సంఖ్యలో పరీక్షలు జరిపేందుకు వసతులను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని వివరించారు విశాఖ కలెక్టర్ మల్లిఖార్జున. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి, తక్కువ సమయంలో ఈ ప్రయోగశాలను పూర్తి చేసుకున్నామని తెలిపారు. త్వరలో 80 మంది సిబ్బందిని ఈ ప్రయోగశాలలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పారు. విశాఖలో మైక్రో బయోలజీ ల్యాబ్ ఇచ్చిన ప్రధాని మోదీ, ఏర్పాటుకు కృషి చేసిన ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు విశాఖ కలెక్టర్ మల్లిఖార్జున.