Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-11-20 10:37:20
తెలంగాణను ప్రధాని నరేంద్రమోదీ అవమానించారని, అలాంటి వ్యక్తికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఊడిగం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. రెండుసార్లు గెలిపించిన సికింద్రాబాద్ ప్రజలను కిషన్ రెడ్డిని ఎందుకు పట్టించుకోవడం లేదని రేవంత్ నిలదీశారు. గుజరాత్‌లో సబర్మతి సుందరీకరణను సమర్థించిన బీజేపీ నేతలు.. మూసీ సుందరీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇదే సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. బీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. పదేళ్ల కాలంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ అస్తవ్యస్తం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తాము చక్కదిద్దుతున్నామని చెప్పిన ఆయన.. మహిళలకు రూ.1 లక్ష మేర వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటించారు. మహిళలను లక్షాధికారులు చేయడమే తమ లక్ష్యమని అన్నారు.