Category : నేర | Sub Category : తెలంగాణ Posted on 2024-11-20 10:28:19
TWM News:-వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకులో సోమవారం అర్ధరాత్రి దుండగులు సినీఫక్కీలో భారీ చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకు వద్ద కాపలాదారుడు లేకపోవడాన్ని గమనించిన దుండగులు ముందుగా అలారం తీగలను కత్తిరించారు. అనంతరం కిటికీని ధ్వంసం చేసి, దానికున్న ఇనుప గ్రిల్ను తొలగించారు. దాని గుండా లోనికి వెళ్లిన వెంటనే సాక్ష్యాలు దొరక్కూడదనే ఉద్దేశంతో సీసీ కెమెరాల వైర్లు తొలగించారు. బ్యాంకులో మూడు సేఫ్టీ లాకర్లు ఉండగా.. వారి వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్ తో కత్తిరించి.. ఒక లాకర్ను తెరిచారు. అందులో సుమారు 500 మంది ఖాతాదారులకు సంబంధించిన బంగారం ఆభరణాల ప్యాకెట్లు ఉన్నాయి. వాటిలో 197 ప్యాకెట్లలోని దాదాపు రూ.14.94 కోట్ల విలువైన 19 కిలోల బంగారం ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దొంగలు చివరగా వెళ్లే ముందు సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ ను సైతం దొంగిలించారు.
లాకర్ తెరిచేందుకు వినియోగించిన గ్యాస్ కట్టర్ను మాత్రం అక్కడే వదిలివెళ్లారు. మంగళవారం బ్యాంకుకు వచ్చిన సిబ్బంది విషయాన్ని గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు, రాయపర్తి, వర్ధన్నపేట ఎస్సైలు శ్రావణ్ కుమార్, రాజు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చోరీ గురించి తెలుసుకొని పలువుర ఖాతాదారులు ఆందోళనతో బ్యాంకు వద్దకు రాగా.. నష్టం జరగకుండా చూస్తామని బ్యాంకు అధికారులు నచ్చజెప్పి పంపారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని, అపహరణకు గురైన సొత్తు వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉందని సీఐ తెలిపారు. మంగళవారం రాత్రి వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ బ్యాంకుకు చేరుకొని పరిశీలించారు. రెండేళ్ల క్రితం కూడా ఈ బ్యాంకులో దుండగులు చోరీకి యత్నం చేశారు. తరువాత ఓ ప్రైవేటు సెక్యూరిటీ గార్డును నియమించగా.. అతను ఏడాది క్రితం మానేశాడు. మళ్లీ ఎవరినీ ఏర్పాటు చేయలేదు.