Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2024-11-20 10:01:20
TWM News:-నవంబర్ 22 నుంచి పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. నవంబర్ 19 మంగళవారం, టీమిండియా మొదటిసారి ఇక్కడ ప్రాక్టీస్ చేసింది. ఈ సమయంలో ఫీల్డింగ్ కసరత్తుల నుంచి నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ వరకు ఇలా ఎన్నో సంకేతాలు వెలువడ్డాయి. దీంతో టీమిండియా టాప్-6 ఎవరనేది ఖరారు అయినట్లు తెలుస్తోంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ: కెప్టెన్ రోహిత్ శర్మ లేడు, స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ కూడా గాయపడ్డాడు. ఈ క్రమంలో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరుంటారోననే ఆసక్తి పెరిగింది. ఈ ఇద్దరి స్థానాన్ని ఎవరు సరిగ్గా భర్తీ చేయగలరు? ఈ ప్రశ్న గత 3-4 రోజులుగా ప్రతి భారతీయ అభిమాని మదిలో మెదులుతోంది. పెర్త్ టెస్టులో బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎవరిని చేర్చాలనే విషయంలో టీమ్ ఇండియా ముందు పెద్ద చిక్కు వచ్చి పడింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్‌లో టీమిండియా కీలక ప్లేయర్లు లేకుండానే బరిలోకి దిగుతోంది. అలాగే, మరెన్నో ప్రయోగాలు చేసేందుకు సిద్ధమైంది. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందో టీమ్ ఇండియా మేనేజ్ మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆప్టస్ స్టేడియంలో జరిగిన టీమిండియా తొలి ప్రాక్టీస్ సెషన్ నుంచే దీనికి సంబంధించిన సూచనలు కనిపించాయి.
ఆస్ట్రేలియా చేరుకున్నప్పటి నుంచి పెర్త్‌లోని డబ్ల్యూఏసీఏ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా, శుక్రవారం నుంచి సిరీస్‌లో మొదటి మ్యాచ్ జరగనున్న ఆప్టస్ స్టేడియంలో నవంబర్ 19 మంగళవారం నుంచి ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది. టీమిండియా మొదటి రోజు ప్రాక్టీస్ వర్షం కారణంగా ప్రభావితమైంది. దీని కారణంగా నెట్స్ సెషన్‌ను మధ్యలో ఆపవలసి వచ్చింది.
ఫీల్డింగ్, ఆ తర్వాత బ్యాటింగ్ ప్రాక్టీస్ నుంచి తొలి సూచనలు..
ఆప్టస్ స్టేడియం వెలుపల నెట్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించే ముందు, టీమిండియా ఫీల్డింగ్‌లో విభిన్నమైన ఫీల్డింగ్ కసరత్తులు చేసింది. ఈ సమయంలో చూసిన దృశ్యం మ్యాచ్ ఆడబోయే ప్లేయింగ్ 11పై కీలక సూచనలు ఇచ్చినట్లైంది. ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్ గురించి సూచలను ఇచ్చింది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, ఫీల్డింగ్ ప్రాక్టీస్ సమయంలో స్లిప్ కార్డన్ చేసినప్పుడు, దేవదత్ పడిక్కల్ మొదటి స్లిప్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో పాటు, విరాట్ కోహ్లీ రెండవ స్లిప్‌లో, కేఎల్ రాహుల్ మూడో స్లిప్‌లో ఉండగా, యశస్వి జైస్వాల్ గల్లీ పొజిషన్‌లో ఉన్నారు. ధ్రువ్ జురెల్ సిల్లీ పాయింట్‌లో ఉన్నాడు.