Category : నేర | Sub Category : జాతీయ Posted on 2024-11-18 11:43:55
TWM News:-తొమ్మిదో తరగతి చదివే ఓ అనాథ బాలుడు అనుమానాస్పద స్థితిలో బావిలో శవమై కనిపించినా... ఆ గ్రామస్థులు మానవత్వం చూపలేదు.
తొమ్మిదో తరగతి చదివే ఓ అనాథ బాలుడు అనుమానాస్పద స్థితిలో బావిలో శవమై కనిపించినా... ఆ గ్రామస్థులు మానవత్వం చూపలేదు. పోలీసులకు విషయం తెలిసినా పట్టించుకోలేదు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో గత నెల 24న చోటుచేసుకున్న ఘటన వివరాలు తాజాగా వెలుగులోకొచ్చాయి. బాలుడు షేక్ సమీర్ స్వగ్రామం గుంటూరు జిల్లా అమరావతి మండలం కర్లపూడి. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో పొన్నేకల్లులోని నాయనమ్మ మస్తాన్బీ వద్ద ఉంటున్నాడు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి (బీ సెక్షన్) చదువుతున్నాడు. ఆ తరగతికే చెందిన ఏ సెక్షన్ విద్యార్థులు పది మంది కొద్ది రోజులుగా ఆ బాలుడితో గొడవపడి కొట్టి భయపెట్టే సరికి గత నెల 24న పాఠశాలకు వెళ్లలేదు. ఆ రోజు మధ్యాహ్నం పాఠశాలలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆ సమయంలో 9వ తరగతి పిల్లలు కొందరు డ్రిల్ చేయకుండా వెళ్లిపోయారు.
ఇంటివద్ద ఉన్న సమీర్ను తీసుకొని ఈత కొడదామని గ్రామ పొలిమేరలోని బావి వద్దకెళ్లి అతని పై దాడి చేసి అందులో పడేసినట్లు సమాచారం. సాయంత్రానికి గ్రామస్థులు, కొందరు ఉపాధ్యాయుల దృష్టికి సమీర్ చనిపోయినట్లు సమాచారం వచ్చింది. వారు అక్కడికి చేరుకుని బావిలో ఉన్న బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. బాలుడి శరీరంపై రక్త గాయాలు, చొక్కాపై రక్తపు మరకలు ఉండటాన్ని గమనించారు. గ్రామస్థులు పోలీసుల్ని మేనేజ్ చేసి పోస్టుమార్టం లేకుండా మృతదేహాన్ని ఆ రాత్రి కర్లపూడి తరలించారు. అక్కడ బాలుడి మృతదేహంపై గాయాలను చూసిన బంధువులు ఆ గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులతో మాట్లాడారు. బాలుడే ఆధారమైన మస్తానీ ్బకి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరారు.
ఉపాధ్యాయులు రూ.50 వేలు పోగేసి ఇవ్వాలని చూడగా... సర్పంచ్ అభ్యంతరం చెప్పారు. మస్తాన్బీతో కలెక్టర్కు ఫిర్యాదు చేయించారు. అప్పటికీ విద్యాశాఖ అధికారులు, పోలీసులు విషయాన్ని బయటకు రానీయలేదు. ఈ ఘటనను పోలీసులు, విద్యాశాఖ తేలిగ్గా తీసుకోవడం, కేసు నమోదు చేయకపోవడం పట్ల ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఈవో సీవీ రేణుక వివరణ కోరగా \'బాలుడి మృతి వాస్తవమే. ఈత రాక బావిలో పడి చనిపోయినట్లు నాకు చెప్పారు. రోజు కొందరు విద్యార్థులు డ్రిల్ సమయంలో బయటకు వెళ్లారు. ఎందుకు వెళ్లారని ఆరా తీస్తున్నాం. తెనాలి ఉప విద్యాశాఖ అధికారితో విచారణ చేయిస్తాం. పిల్లలు బయటకుపోతే పట్టించుకోని హెచ్ఎం, పీఈటీల నుంచి వివరణ కోరతాం అని వివరించారు.