Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-11-18 10:38:56
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఎంతటి దుమారానికి కారణమైందో అందరికీ తెలుసు. తిరుమల లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ జరిగిందని.. కోట్లాది మంది భక్తుల మనోభావాలను గత వైసీపీ ప్రభుత్వం దెబ్బ తీసిందని స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించడం తీవ్ర దుమారానికి కారణమైంది. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ మొదలైంది. దీంతో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే దీనిపై వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మరో మలుపు తిరిగింది.తిరుమల లడ్డూ వ్యవహారం కోట్లాది మంది మనోభావాలతో కూడిన అంశం అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కాబట్టి ఈ వ్యవహారంపై దర్యాప్తు సమగ్రంగా ఉండాలని.. ఇందుకు సీబీఐ నేతృత్వంలో జరిగితే బాగుంటుందని సూచించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు, సీబీఐ నుంచి ఇద్దరు, FSSAI నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలని తీర్పు చెప్పింది. ఈ బృందానికి సీబీఐ డైరెక్టర్ నేతృత్వం వహించాలని కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ తరపున హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు, విశాఖ సీబీఐ ఎస్పీ మురళీ రంభ, ఏపీ ప్రభుత్వం నుంచి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీ, విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టీ, FSSAIనుంచి ఒకరు టీంగా ఏర్పడ్డారు. ఇది ఇటీవలే తిరుమల చేరుకుంది.
తిరుమల చేరుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం టీటీడీ అధికారులను కలిసింది. తమకు కార్యాలయంతో పాటు కంప్యూటర్లు, ప్రింటర్లు తదితర సామాగ్రి సమకూర్చాలని కోరింది. అలాగే తమకు అనుబంధంగా వివిధ కేడర్ లలో పనిచేస్తున్న 30 మంది సిబ్బందిని కేటాయించాలని కోరింది. సిట్ అడిగిన వాళ్లందరినీ టీటీడీ సమకూర్చింది. తిరుపతి కేంద్రంగా ఈ బృందం పనిచేస్తుంది. ఇందుకోసం తిరుపతిలో ఓ గెస్ట్ హౌస్ ను సిట్ కోసం కేటాయించినట్లు తెలుస్తోంది. అలాగే తిరుమలలో కూడా ఓ కార్యాలయాన్ని సిట్ కు కేటాయించింది టీటీడీ.రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటికే తొలిదశ విచారణ పూర్తి చేసింది. ఆ సిట్ నుంచి కూడా ప్రస్తుత సిట్ సమాచారాన్ని తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అలాగే తమిళనాడు, నెల్లూరు, వడోదర, ఢిల్లీ, హైదరాబాద్.. లాంటి ప్రాంతాల్లో కూడా సిట్ పర్యటించి సమాచారాన్ని సేకరించనున్నట్టు తెలుస్తోంది. కల్తీ నెయ్యిపై తేల్చడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి కల్తీ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన కూడా సిట్ నివేదిక ఉంటుందని తెలుస్తోంది. వీలైనేంత త్వరగా తమకు అప్పగించిన పనిని పూర్తి చేయాలని సిట్ భావిస్తోంది. సిట్ విచారణ పూర్తయితే కల్తీ నెయ్యిపై ఓ క్లారిటీ రానుంది.