Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-11-18 10:32:47
2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా పెద్ద సంచలనమే అని చెప్పాలి. 2014 నుంచి కేంద్రంలో ఎన్డీయే అధికారంలో ఉంది. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీతో పాటు ఎన్డీయే పార్టీలు తీవ్రంగా కృషి చేశాయి. మోదీకి తిరుగులేదని.. మళ్లీ ఆయనే ప్రధాని అని సర్వేలన్నీ తేల్చేశాయి. బీజేపీకి ఒంటరిగానే 300లకు పైగా సీట్లు వస్తాయని అంచనా వేశాయి. అయితే లోక్ సభ ఎన్నికల ఫలితాలు మాత్రం మరోలా వచ్చాయి. బీజేపీ సొంతంగా మెజారిటీ సీట్లు దక్కించుకోలేకపోయింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జేడీయూల మద్దతు కేంద్రంలోని బీజేపీకి అవసరమైంది. ఐదేళ్లపాటు దూరంగా ఉండి ఎన్నికల ముందు బీజేపీ కూటమిలో చేరిన టీడీపీ చెప్పుచేతల్లో మోదీ ప్రభుత్వం పని చేయాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఏపీలో టీడీపీ గెలిస్తుందో గెలవదో అనే అనుమానాలు కూడా ఉండేవి. కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ కేంద్రంలో చంద్రబాబు మళ్లీ చక్రం తిప్పే స్థాయికి ఎదిగారు. చంద్రబాబు, నితీశ్ కుమార్ కలిసి కేంద్రంలో మోదీ మెడలు వంచుతారని ఇండియా కూటమి పార్టీలు అంచనా వేశాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మాత్రం మరోలా ఉన్నాయి.
2014-2018 మధ్య ఏపీతో పాటు దేశంలో బీజేపీ, టీడీపీ కలిసి పనిచేశాయి. అప్పుడే విడిపోయిన రాష్ట్రానికి ఎక్కువ నిధులు కావాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బీజేపీపై విపరీతమైన ఒత్తిడి పెట్టారు. దీంతో బీజేపీ, టీడీపీ మధ్య గ్యాప్ వచ్చింది. రెండూ విడిపోయాయి. 2019 ఎన్నికల్లో బీజేపీని వదిలేసి పోటీ చేయడంతో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. చివరకు 2024 నాటికి టీడీపీ తప్పు తెలుసుకుని మళ్లీ బీజేపీతో జతకట్టింది. ఈసారి బీజేపీ తనపై ఆధారపడేంత స్థాయికి ఎదిగింది. దీంతో ఈసారి రాష్ట్రానికి సంబంధించి డిమాండ్లన్నింటినీ ముందుంచి చంద్రబాబు సాధించుకుంటారని అందరూ అనుకున్నారు.కానీ ఈసారి చంద్రబాబు మాత్రం పూర్తిగా మారిపోయాగి. మోదీ ప్రభుత్వ మనుగడ తన చేతుల్లో ఉన్నా పూర్తిగా అణిగిమణిగి ఉన్నారు. మోదీపై పూర్తి విశ్వాసం కనబరుతున్నారు. మోదీయే తమ నాయకుడని.. అందరం కలిసికట్టుగా దేశం కోసం పని చేస్తామని చెప్పుకొస్తున్నారు. మోదీకీ, చంద్రబాబుకు మధ్య గ్యాప్ తీసుకొచ్చేందుకు ఎవరెన్ని ప్రయత్నాలు చేస్తున్నా వాళ్లిద్దరూ మాత్రం పూర్తిగా పరస్పర విశ్వాసంతో పనిచేసుకుంటూ పోతున్నారు. చంద్రబాబు కూడా గతంలో లాగా గొంతెమ్మ కోర్కెలు కోరకుండా ఆచరణ సాధ్యమైనవి మాత్రమే కోరుతున్నారు. మోదీ ప్రభుత్వం కూడా చంద్రబాబు అడిగిన వాటిని కాదనకుండా చేస్తోంది. మోదీ ప్రభుత్వ మనుగడ తనపై ఆధారపడి ఉన్నా.. చంద్రబాబు ప్రధానిపై కనబరుస్తున్న విశ్వాసం ఆశ్చర్యపరుస్తోందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.