Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2024-11-18 10:17:12
TWM News:-అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ బరువు వేగంగా తగ్గుతోంది. దీంతో నాసా వైద్యులు ఆందోళన చెందుతున్నారు. సునీతా బరువు ఎందుకు తగ్గుతోందో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఓ రిపోర్టు తయారు చేస్తోంది. అయితే నాసా సునీతా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అధిక కేలరీల ఆహారం, వ్యాయామ ప్రణాళికలపై పనిచేస్తోంది.
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ వేగంగా బరువు తగ్గడం నాసా వైద్యులకు కొత్త సవాలుగా మారింది. జూన్‌లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)కి చేరుకున్నప్పటి నుంచి సునితా బరువు నిరంతరం తగ్గుతూ వచ్చింది. ఇది వైద్యులకు ఆందోళన కలిగించే విషయంగా మారింది. అమెరికన్ న్యూయార్క్ పోస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం సునీతా బరువును సాధారణ స్థాయికి తీసుకురావడానికి నాసా నిపుణులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
మిషన్ సమయం ఎందుకు పెరిగిందంటే
నాసాకు చెందిన సైంటిస్టులు సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‌లు కలిసి ఈ ఏడాది జూన్ 5న బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా అంతరిక్షంలోకి అడుగు పెట్టారు. మొదట్లో ఈ మిషన్ ఎనిమిది రోజులు మాత్రమే షెడ్యూల్ చేయబడింది అయితే స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా వీరు అంతరిక్షంలో ఉండాల్సిన సమయం పొడిగించబడింది. ఈ సమయంలో చాలా కాలం పాటు అంతరిక్షంలో చిక్కుకోవడం వల్ల సునీతా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడు వారి అంతరిక్ష యాత్ర ఎనిమిది నెలల పాటు పొడిగించబడింది. వీరు భూమికి తిరిగి రావడం ఫిబ్రవరి 2025 నాటికి మాత్రమే సాధ్యమవుతుందని నాసా వెల్లడించింది. దీంతో ఇప్పుడు నాసా సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‌ల ఆరోగ్య పరిస్థితిని కాపాడంపై పూర్తి శ్రద్ధ చూపిస్తోంది.