Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-11-18 10:03:37
గత ప్రభుత్వం నేతృత్వంలో సోషల్ మీడియా వేదికగా ఎందరి పైన అసభ్యకరమైన పోస్టులు, అభ్యంతరకరమైన కామెంట్లు పెట్టారంటూ గత కొద్ది కాలంగా జరుగుతున్న హడావిడి మనం చూస్తున్నాం. ఈ సోషల్ మీడియా వేధింపులకు చంద్రబాబు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వరకు, హోం మంత్రి దగ్గర నుంచి మామూలు కార్యకర్తల వరకు ఎవ్వరూ అతీతులు కాదు. ఎవరి వంతు వారిదే అన్నట్లుగా.. ఎవ్వరిని వదలకుండా, ఆఖరికి కుటుంబ సభ్యులను కూడా కలుపుకుంటూ ఎన్నో రకాల పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..
ఈ నేపథ్యంలో ఎలాగైనా ఈ సోషల్ మీడియా వేధింపులకు ఫుల్ స్టాప్ పెట్టాలి అని కూటమి ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఏపీ పోలీసులు కూడా సోషల్ మీడియా వేధింపులకు పాల్పడిన వారిపై ఉక్కు పాదం మోపుతున్నారు. ఇప్పటికే ఈ విషయంలో పలువురు అరెస్ట్ కాగా చాలామందికి నోటీసులు కూడా అందాయి. మరోపక్క ఈ విషయంపై స్పందిస్తున్న వైసీపీ నేతలు అరెస్టులు చేయడం అన్యాయం అంటూ వాపోతున్నారు. పార్టీలకు అతీతంగా.. ఎటువంటి తారతమ్యాలకు చోటు లేకుండా.. నేతలపై, అతని కుటుంబ సభ్యులపై అమర్యాదకరమైన వ్యాఖ్యలు,జుగుప్సకరమైన విమర్శలు చేసిన వారిపై తీవ్రమైన చర్యలు తప్పవు అని నొక్కి చెబుతున్నారు పోలీసులు. తాజాగా ఇందులో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ తరఫున 2024 ఎన్నికలకు ముందు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న కొడాలి నాని పై కూడా కేసు నమోదయింది. 2024 ఎన్నికల అనంతరం పూర్తిగా సైలెంట్ అయిపోయిన నాని.. ఎన్నికలకు ముందు మాత్రం ఓ రేంజ్ లో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా అప్పటి ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్ పై ఎన్నో ఆరోపణలు చేశారు. అయితే ఈసారి నాని పై కేసు పెట్టింది ఓ సాధారణ స్టూడెంట్ కావడం విశేషం. గతంలో జరిగిన కొన్ని వీడియోలను షేర్ చేసిన ఆ స్టూడెంట్.. కొడాలి నాని సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును, లోకేష్ ను దుర్భాషలాడడం.. తాను భరించలేకపోయాను అంటూ చెబుతూ శనివారం రాత్రి ఆంధ్ర యూనివర్సిటీ లా కాలేజీ స్టూడెంట్ అయిన అంజన ప్రియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విశాఖ త్రీ టౌన్ పోలీసులు కొడాలి నాని పై కేసు నమోదు చేశారు.