Category : వ్యాపారం | Sub Category : ఆంధ్రప్రదేశ్ Posted on 2024-11-15 10:07:13
TWM News:-ఈ నెల 29న విశాఖపట్నం జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజెన్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు అప్పుడే ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. రూ 84 వేల కోట్ల పెట్టుబడితో 25 వేల ఉద్యోగాలు కల్పించే భారీ ప్రాజెక్టుకు నవంబర్ 29న విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేస్తున్నట్లు ప్రకటించారు.
ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పాలసీలపై సీఎం చంద్రబాబు సభా ముఖంగా ప్రకటన చేశారు. గడిచిన ఐదేళ్లలో 227 ఎంవోయూలు జరిగినా పైసా పెట్టుబడి రాష్ట్రానికి రాలేదని సీఎంచంద్రబాబు అన్నారు. పన్నులు, కరెంటు ఛార్జీలు పెంచటం వల్ల పరిశ్రమలు మనుగడ సాధించలేని పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి ఏపీ దేశంలోనే నెంబర్ వన్‌గా ఉండాలనే ఈ పాలసీలు తీసుకువచ్చామని, ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త అనే నినాదాన్ని సాధ్యం చేసి చూపుతామని స్పష్టం చేశారు.
రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల మందికి ఉపాధి రావాలనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వ నూతన పాలసీలు అప్పుడే ఫలితాలను ఇస్తున్నాయని రెండు భారీ ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయని చంద్రబాబు తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కోసం ఎన్టీపీసీ సంస్థ ముందుకు వచ్చిందని ఈ నెల 29న విశాఖపట్నం జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజెన్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. మూడు దశల్లో మొత్తం రూ. 84 వేల 700 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు వస్తోందని, ఎన్టీపీసీతో పాటు ఏపీ జెన్కో కూడా సంయుక్తంగా ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉంటారని తెలిపారు.
రిలయన్స్ సంస్థ కూడా 65 వేల కోట్లతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని, రాష్ట్రంలో పరిశ్రమలు వస్తే వాటిని ప్రోత్సహించాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులకు ఉందని స్పష్టం చేశారు.ఉత్పత్తిలో ఏపీని గ్లోబల్ డెస్టినేషన్ గా మార్చాలనేది ప్రభుత్వ విధానమని, అదే సమయంలో రూ.83 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి రావాలని ఆశిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రతి చోట ఒక ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. పారిశ్రామిక పార్కులు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఉంటాయని, పోర్టు ఆధారిత పరిశ్రమల ద్వారా ఏపీని అభివృద్ధి పథంలో నిలుపుతామని సీఎం చంద్రబాబు చెప్పారు.