Category : | Sub Category : బ్రేకింగ్ న్యూస్ Posted on 2024-02-03 14:02:28
TWM Live News : భారతీయ జనతా పార్టీ సహా వ్యవస్థాపకులు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. లాల్‌కృష్ణ అద్వానీని భారతరత్నతో సత్కరించనున్న విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ ప్రధాని మోదీ అన్నారు. ‘అతనితో మాట్లాడి అభినందించాను. అద్వానీ మన కాలంలో అత్యంత గౌరవనీయమైన రాజకీయ నాయకులలో ఒకరు. భారతదేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిది’ అంటూ ప్రధాని ప్రశంసించారు.
భారతదేశ అత్యున్నత గౌరవం భారతరత్నను అద్వానికి ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. ఈ సారి సోషలిస్ట్ నేత కర్పూరీ ఠాకూర్, అద్వానీ ఇద్దరికి భారతరత్న ఇవ్వడం ఒక విశేషం. అద్వానికి భారత రత్న ఇవ్వడం ద్వారా తన రాజకీయ గురువు రుణం మోదీ తీర్చుకున్నరా? పార్టీని 2 స్ధానాల నుంచి కేంద్రంలో అధికారంలోకి తీసుకుని రావడంలో అద్వానీది కీలక పాత్ర. అంతేకాదు అయోధ్యలో రామాలయ నిర్మాణంలో అద్వానీ కీలక భూమిక పోషించారు.
లాల్ కృష్ణ అద్వానీ అట్టడుగు స్థాయిలో పని చేయడం ద్వారా ప్రారంభించి దేశానికి ఉప ప్రధాని అయ్యారు. కేంద్ర హోం మంత్రిగా, సమాచార ప్రసార శాఖ మంత్రిగా కూడా తనదైన ముద్ర వేశారు. లాల్ కృష్ణ అద్వానీ మూడు సార్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. మాజీ ప్రధాని దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో దేశానికి హోం మంత్రి, డిప్యూటీ ప్రధానిగా కూడా సేవలందించారు.
లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న లభించిన సమాచారాన్ని పంచుకున్న ప్రధాని నరేంద్ర మోడీ, అద్వానీ దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో పనిచేశారని, పారదర్శకత, సమగ్రతకు పూర్తిగా కట్టుబడి ఉన్నారని అన్నారు. రాజకీయ నీతిలో అద్వానీ ప్రమాణాలు నెలకొల్పారని ప్రధాని మోదీ కొనియాడారు. జాతీయ ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనానికి అద్వానీ ప్రత్యేక కృషి చేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయనను భారతరత్నతో సత్కరించడం చాలా భావోద్వేగమైన క్షణం. అతనితో సంభాషించడానికి, అతని నుండి నేర్చుకోవడానికి లెక్కలేనన్ని అవకాశాలు లభించడం నా అదృష్టంగా భావిస్తాను అని ప్రధాని పేర్కొన్నారు.