Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2024-09-27 13:06:14
మకావు ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 300 టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిదాంబి శ్రీకాంత్, గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ఆరో సీడ్ శ్రీకాంత్ 21-13, 21-18తో ఆయుష్ శెట్టిపై విజయం సాధించాడు. క్వార్టర్స్లో లాంగ్ ఆగ్నస్ (హాంకాంగ్) తో శ్రీకాంత్ తలపడతాడు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో గాయత్రి- ట్రీసా జోడీ 22-20, 21-11తో లిన్ చున్- చున్ సున్ (చైనీస్ తైపీ) జంటను చిత్తుచేసింది. క్వార్టర్స్లో యున్ హ్యు- లిన్ యున్ (చైనీస్ తైపీ) జోడీతో గాయత్రి- ట్రీసా జంట అమీతుమీ తేల్చుకోనుంది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో తస్నిమ్ మీర్ 17-21, 21-13, 10-21తో తొమొక మియజాకి (జపాన్) చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్లో సుమీత్రెడ్డి- సిక్కిరెడ్డి జోడీ 17-21, 14-21తో వాంగ్ తీన్- లిమ్ సీన్ (మలేసియా) జంట చేతిలో పరాజయం చవిచూసింది.