Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-09-27 10:16:51
సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతి చట్టప్రకారం వ్యవహరిస్తామంటున్న అధికారులు
తెలుగు వెబ్ మీడియా న్యూస్: శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్యమతస్థుల నుంచి డిక్లరేషన్ కోరినట్లే మాజీ సీఎం జగన్ నుంచీ తీసుకునేందుకు తితిదే అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ముందుగానే అతిథిగృహం వద్దకు వెళ్లి ఆయనకు డిక్లరేషన్ ఫారాన్ని అందించనున్నారు. ఆయన సంతకం చేస్తే దర్శనానికి అనుమతించనున్నారు. తిరస్కరిస్తే దేవాదాయశాఖ చట్టప్రకారం నడుచుకుంటామని తితిదే అధికారులు చెబుతున్నారు. అంటే డిక్లరేషన్ పై సంతకం పెట్టకపోతే దర్శనానికి అనుమతించరని స్పష్టమవుతోంది.
వైకాపా హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యిని వినియోగించిన అంశంపై పెను దుమారం రేగింది. నాటి ప్రభుత్వంతోపాటు అప్పటి తితిదే ఛైర్మన్లుగా వ్యవహరించిన వై.వి.సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి, ఈవో ధర్మారెడ్డిలపై భక్తులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఈ వ్యవహారం నడుస్తుండగానే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేందుకు జగన్ మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. శుక్రవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి వచ్చి, అక్కడినుంచి తిరుమల చేరుకోనున్నారు. శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. అన్యమతస్థుల్లో సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు 17వ కంపార్ట్ మెంట్ వద్ద డిక్లరేషన్ పై సంతకం చేయించుకుంటారు. వీఐపీలు వచ్చినప్పుడు అధికారులే అతిథిగృహం వద్దకు వెళ్లి సంతకాలు తీసుకుంటారు. జగన్ శుక్రవారం తిరుమల వస్తే అతిథిగృహం వద్దకు వెళ్లి తితిదే నిబంధనలు, దేవాదాయశాఖ చట్టంలోని అంశాలను ఆయనకు వివరించి డిక్లరేషన్ పై సంతకం కోరనున్నారు.