Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-26 10:24:25
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓ వైపు ఎండలు, మరోవైపు వానలతో వాతావరణం వేగంగా మారుతోంది. భిన్న వాతావరణ పరిస్థితుల మధ్య.. తెలుగురాష్ట్రాలకు ఓవైపు వడగాలులు, మరోవైపు వర్ష సూచనా చేసింది ఐఎండీ. ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. అంతేకాకుండా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయిని అధికారులు పేర్కొన్నారు...
శనివారం, ఆదివారం ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని చాలా జిల్లాలలో రాత్రి పూట వేడి వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి.. ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరినగర్, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మొత్తం 11 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాగల రెండు రోజులు తెలంగాణలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం గరిష్టంగా ఆదిలాబాద్ లో 44.6, కనిష్టంగా హైదరాబాద్ లో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది....
శుక్రవారం ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రామగుండం, మహబూబ్ నగర్, ఖమ్మం, హనుమకొండ లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. నిజామాబాద్.. 45, ఆదిలాబాద్.. 44.6, రామగుండం.. 43.2, మెదక్.. 42.8, ఖమ్మం.. 41.6, మహబూబ్ నగర్.. 41, నల్లగొండ.. 41, భద్రాచలం.. 40.6, హైదరాబాద్.. 39.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి...
ఈ రోజు తెలంగాణ లోని ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.. ఉరుములు మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది...
ఏపీలో తీవ్ర వడగాడ్పులు...
శనివారం ఏపీలో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. శ్రీకాకుళం జిల్లా బూర్జ, హిరమండలం, లక్ష్మీనరసుపేట, పాతపట్నం, విజయనగరం జిల్లా సంతకవిటి, పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి, పాలకొండ మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీయనున్నాయి.. శ్రీకాకుళం-1, విజయనగరం-15, పార్వతీపురంమన్యం-9, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2, తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది.. మరో 28 మండలాల్లో వడగాడ్పులు ప్రభావం కనిపించనుంది. ఆదివారం నాలుగు మండలాల్లో తీవ్ర, 17 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది...
శుక్రవారం వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. నంద్యాల జిల్లా గాజులపల్లె, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 42.5 డిగ్రీలు, కర్నూలు జిల్లా లద్దగిరి, ప్రకాశం జిల్లా కొనకనమిట్లలో 42.4 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా వత్తలూరు, విజయనగరంలో 42 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 169 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేసవి అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఉరుములతో కూడిన అకాల వర్షాలు పటేడప్పుడు చెట్ల క్రింద నిలబడవద్దని సూచించింది....