Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2025-04-26 10:23:19
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. ఏప్రిల్ 22వ తేదీన జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు. భారత్, పాక్ మధ్య కశ్మీర్ విషయంలో చాలా ఏళ్లుగా గొడవ జరుగుతోందని అన్నారు. అయితే, దాన్ని ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయని తెలిపారు.
రోమ్ పర్యటనకు బయల్దేరిన ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడారు. ఈసందర్భంగా భారత్-పాక్ ఉద్రిక్తతలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఆ రెండు దేశాలు నాకు చాలా దగ్గరని అని తెలిపారు. పర్యటకులపై జరిగిన ఉగ్రదాడి చెత్త పనిగా వర్ణించారు. ముష్కరుల దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని చెప్పారు. అయితే, ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఏప్రిల్ 22న పహల్గాం సమీపంలోని ప్రముఖ పర్యటక ప్రాంతమైన బైసరన్ లోయలో ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడిన సంగతి తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చినవారు పర్యాటకులను చుట్టుముట్టి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెంట్ ఫోర్స్ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో భారత్, పాక్‌ల మధ్య ఉద్రికత్తలు భగ్గుమన్నాయి.