Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2025-04-26 10:22:39
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడి తర్వాత రష్యా, పాకిస్థాన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌లోని రష్యన్ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. రష్యన్ పౌరులు పాకిస్థాన్‌కు రావొద్దంటూ కోరింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఈ ప్రకటన జారీ చేసింది. “పాకిస్తాన్-భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రష్యన్ పౌరులు తాత్కాలికంగా పాకిస్తాన్‌ను సందర్శించకుండా ఉండాలని మేం సిఫార్సు చేస్తున్నాం.” అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అంతకుముందు, పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షుడు ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి సంతాప సందేశాన్ని పంపారు. ఉగ్రవాదపు అన్ని రూపాలు, వ్యక్తీకరణలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో భారత్‌తో పరస్పర చర్యను మరింత వేగవంతం చేయడానికి సంసిద్ధంగా ఉన్నామంటూ పుతిన్ పేర్కొన్నారు. అలాగే పహల్గామ్‌లో జరిగిన క్రూరమైన నేరాన్ని సమర్థించలేం. దాడికి పాల్పడిన వారు తగిన శిక్షను పొందుతారని మేం విశ్వసిస్తున్నాం అని అన్నారు.
మరోవైపు పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే భారత్, పాక్‌పై అనేక చర్యలు తీసుకుంది. పాకిస్తాన్ దేశస్థులకు సార్క్ వీసాలను నిలిపివేసింది, అటారీ బార్డర్ వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ (ICP)ను మూసివేసింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు కూడా ప్రకటించింది. అలాగే పాకిస్తాన్ తన గగనతలాన్ని అన్ని భారతీయ విమానయాన సంస్థలకు అడ్డుకోవడం ద్వారా ప్రతిస్పందించింది. వాఘా సరిహద్దును కూడా మూసివేసి, భారతదేశంతో అన్ని వాణిజ్యాలను నిలిపివేసింది. మరో ముఖ్యమైన నిర్ణయం సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేసింది.