Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2025-04-08 11:52:29
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- భారత స్టార్ షట్లర్లు పి.వి. సింధు, లక్ష్యసేన్, హెచ్.ఎస్.ప్రణయ్లు ఆసియా ఛాంపియన్షిప్ టైటిల్పై గురిపెట్టారు. గత కొంతకాలంగా పేలవమైన ఫామ్తో ఇబ్బందులు పడుతున్న వీరు మళ్లీ గాడినపడాలని భావిస్తున్నారు.
నింగ్బో (చైనా): మంగళవారం ప్రారంభమయ్యే ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఎస్తర్ నురుమి వార్డోయో (ఇండోనేసియా)తో సింధు, ఇంతానన్ రచనోక్ (థాయ్లాండ్)తో అనుపమ ఉపాధ్యాయ, ఫాంగ్ జీ (చైనా)తో మాళవిక బాన్సోద్, యూ హాన్ (చైనా)తో ఆకర్షి కశ్యప్ తలపడనున్నారు. పురుషుల సింగిల్స్ లో లీ చియా హావో (చైనీస్ తైపీ)తో లక్ష్య, గ్వాంగ్ జు లు (చైనా)తో ప్రణయ్, కాంటాఫాన్ (థాయ్లాండ్)తో ప్రియాన్షు రజావత్ తమ పోరాటాన్ని ప్రారంభిస్తారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో క్వాలిఫయర్ జంటతో గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ జోడీ తలపడనుంది. పురుషుల డబుల్స్లో పృథ్వీ- సాయి ప్రతీక్, హరిహరన్- రూబన్ కుమార్; మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్- రుత్విక శివాని, సతీశ్- ఆద్య, ధ్రువ్ కపిల- తనీషా క్రాస్ట్లో, ఆశిత్- అమృత జోడీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.