Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-08 11:18:49
తెలుగు వెబ్ మీడియా న్యూస్:శాసనమండలి సభ్యులుగా నూతనంగా ఎన్నికైన పింగిలి శ్రీపాల్రెడ్డి (పీఆర్డీయూ-టీఎస్), మల్క కొమరయ్య (భాజపా), చిన్నమైల్ అంజిరెడ్డి(భాజపా), నెల్లికంటి సత్యం(సీపీఐ), కేతావత్ శంకర్నాయక్(కాంగ్రెస్), అద్దంకి దయాకర్(కాంగ్రెస్), విజయశాంతి(కాంగ్రెస్) ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కౌన్సిల్లోని తన ఛాంబర్ సోమవారం వారితో ప్రమాణం చేయించారు. ఉదయం 10.15 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. కార్యక్రమంలో కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, శాసనసభ కార్యదర్శి డా. నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. భారాస ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్వల్ప అస్వస్థత కారణంగా ప్రమాణ స్వీకారం చేయలేదు. రెండు మూడు రోజుల్లో ఆయన ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. వారి అభిమానులు, పార్టీల కార్యకర్తలు భారీగా తరలిరావడంతో మండలి ప్రాంగణంలో సందడి నెలకొంది. అంతకుముందు భాజపా ఎమ్మెల్సీలు కొమరయ్య, అంజిరెడ్డి ట్యాంక్బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. తర్వాత భాజపా నేతలతో కలిసి అమరవీరుల స్తూపం వద్దకు వాహనాలపై ర్యాలీగా వెళ్లి నివాళులు అర్పించారు.
జీతభత్యాల్లో పార్టీకి 25% ఇస్తా..
ప్రమాణం చేసిన అనంతరం అద్దంకి దయాకర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటానన్నారు. జీతభత్యాల నుంచి 25 శాతం పార్టీకి(ఏఐసీసీకి 10 శాతం, పీసీసీకి 15 శాతం) కేటాయిస్తానని తెలిపారు. భాజపా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతో కళాశాల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని.. బకాయిలను ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. మల్క కొమరయ్య మాట్లాడుతూ నిరుద్యోగుల పక్షాన నిలబడి మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పారు. శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ పెండింగ్ డీఏలు, గతం కంటే మెరుగైన పీఆర్సీ కోసం సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంటానన్నారు.