Category : | Sub Category : జిల్లా వార్తలు Posted on 2024-09-16 15:43:29
తెలుగు వెబ్ మీడియా న్యూస్: సీఎం చంద్రబాబు పట్టుదలతో విజయవాడ ప్రాంతంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారిని వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన దర్శించుకున్నారు. తొలుత తితిదే అధికారులు ఆయన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
అనంతరం ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి సంపూర్ణ సహకారాలు అందించేలా స్వామివారు దీవెనలు ఇవ్వాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. ఐదేళ్లలో పంచాయతీరాజ్ వ్యవస్థను వైకాపా నాశనం చేసిందని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దాన్ని 100 రోజుల్లో సరి చేశారన్నారు. రాష్ట్రంలో సంతృప్తికర పాలన చేస్తున్న చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని స్వామిని వేడుకున్నట్లు చెప్పారు. విజయవాడ వరదల్లో కుట్రకు పాల్పడిన వారికి స్వామి తగిన బుద్ధి చెప్తారన్నారు. మరోవైపు ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.