Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-16 10:34:46
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- వైఎస్సార్ కాంగ్రెస్ పార్ట నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా ఫిర్యాదు చేసింది. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజుకు టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ నాయకుడు భాను ప్రకాశ్‌రెడ్డి ఫిర్యాదు అందించారు. దీనిపై ఎస్పీ మీడియాకు స్పందిస్తూ కేసు నమోదు చేస్తామని తెలిపారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ అయిన భూమనపై ఇలా అధికారికంగా ఫిర్యాదు చేయడం, కేసు నమోదవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.ఇటీవలి కాలంలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ భూమన మీడియా ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోశాల గురించి మాట్లాడారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే 100కి పైగా గోవులు, లేగలు మృతి చెందాయని ఆయన ఆరోపించారు. గోశాల నిర్వహణలో నిర్లక్ష్యమే దీనికి కారణమని, టీటీడీ బోర్డు బాధ్యత వహించాలంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు, హిందువుల మనోభావాలు దెబ్బతింటోందంటూ కొన్ని ఫొటోలు కూడా చూపిస్తూ వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించారు.ఈ ఆరోపణలపై టీటీడీ ప్రస్తుత చైర్మన్, ఈవోలు స్పందించారు. సాధారణంగా అనారోగ్యం, వయస్సు కారణంగా గోశాలలో ఆవుల మృతి సహజమని తెలిపారు. భూమన మాత్రం ఈ విషయాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటూ, మతం తో రాజకీయం చేయాలని ప్రవర్తిస్తున్నారంటూ విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ అజెండాలో భాగంగా చేస్తున్నదేనని టీటీడీ అభిప్రాయపడుతోంది.ఈ నేపథ్యంలో భూమనపై చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో టీటీడీ ఆధారాలు సేకరించింది. గతంలో వచ్చిన ఇంటెలిజెన్స్ నివేదికలు, ఆయన ఆరోపణలకు సంబంధించి మీడియాకు అందించిన దృశ్యాలన్నింటినీ ఫిర్యాదులో చేర్చారు. ఈ ఫిర్యాదును బీజేపీ నేత భాను ప్రకాశ్‌రెడ్డి ఎస్పీ హర్షవర్ధన్‌రాజుకు అందించి, భూమనపై కేసు నమోదు చేయాలని కోరారు. ఈ అంశం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. టీటీడీ తొలి సారి ఇలా ఓ మాజీ చైర్మన్‌పై చర్యలు తీసుకోవడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. భూమన ఈ విషయం పై ఎలా స్పందిస్తారో? ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి..