Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2025-04-10 10:21:16
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : అగ్రరాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనకుడుగు వేశారు. ఇటీవల పలు దేశాలపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం చైనాకు వర్తించదని పేర్కొంది. అంతేకాకుండా చైనాపై సుంకాలను 104 నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించింది.
చైనా తప్ప మిగిలిన దేశాల వస్తువులపై 10 శాతం బేస్‌లైన్ సుంకం మాత్రం కొనసాగుతుందని ట్రంప్ సర్కార్ స్పష్టం చేసింది. 75 కంటే ఎక్కువ దేశాలు తమతో వాణిజ్య చర్చలు జరిపాయని తెలిపింది. ఆయా దేశాలు ప్రతీకార సుంకాలు విధించకపోవడం వల్ల తాను ప్రకటించిన టారిఫ్‌లను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ట్రంప్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. 10 శాతం బేస్‌లైన్ సుంకం మాత్రం ఉంటుందని చెప్పారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు.