Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2025-04-10 10:10:34
తెలుగు వెబ్ మీడియా న్యూస్: ప్రపంచ దేశాలపై సుంకాల మోత మోగించిన అమెరికా అధ్యక్షలు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. బుధవారం(ఏప్రిల్ 9) నుంచి భారత్, చైనాపై ట్రంప్ విధించిన టారిఫ్‌లు అమల్లోకి వచ్చాయి. అమెరికా దేశ వాణిజ్య లోటును తగ్గించడం, అమెరికన్ పరిశ్రమలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఏకంగా 180 దేశాలపై సుంకాలు విధించారు ట్రంప్. ఇక అనుకున్న దానికంటే భారత్‌పై ఎక్కువగానే సుంకాల మోత మోగించారు.
ఈ నేపథ్యంలోనే అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. తన హెచ్చరికలను చైనా పెడచెవిన పెట్టడంతో చైనా వస్తువులపై విధించిన సుంకాలు 104 శాతానికి చేరాయి. బుధవారం(ఏప్రిల్ 9) నుంచి అమలులోకి రానున్నాయి. ఇటీవల చైనా కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం అదనపు సుంకం విధించింది. దీంతో ట్రంప్.. ఏప్రిల్ 8లోగా చైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. ఇచ్చిన గడువులోగా చైనా స్పందించకపోవడంతో తాను చెప్పినట్లుగానే అదనంగా మరో 50 శాతం సుంకాలు పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. చైనా టారిఫ్‌పై ట్రంప్ మాట్లాడుతూ ఇవన్నీ శాశ్వత సుంకాలన్నారు. తగ్గించే చర్చలు జరుపుతామన్నారు అమెరికా అధ్యక్షుడు. టారిఫ్‌లపై మొండి వైఖరి లేదన్నారు.
మరోవైపు డొనాల్డ్ ట్రంప్ విధించిన 104 శాతం సుంకాలకు ప్రతిగా చైనా కూడా అమెరికా వస్తువులన్నింటిపై 84 శాతం అదనపు సుంకాలను విధించింది. ఏప్రిల్ 10 నుండి అమెరికా నుండి వచ్చే వస్తువులపై ఈ అదనపు సుంకాలు విధించడం జరుగుతుందని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పిందని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. గతంలో ప్రకటించిన 34 శాతం నుండి బీజింగ్ ప్రతీకార సుంకం రేటు పెంచింది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ 12 అమెరికన్ సంస్థలను దాని ఎగుమతి నియంత్రణ జాబితాలో చేర్చినట్లు ప్రకటించింది. అదే సమయంలో 6 అమెరికన్ సంస్థలను దాని విశ్వసనీయ సంస్థ జాబితాలో చేర్చింది.