Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-09 10:52:35
తెలుగు వెబ్ మీడియా న్యూస్:రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని, ముఖ్యమంత్రిని కాపాడుతున్నది కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వమేనని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అనేక స్కాములపై ఆధారాలు ఇచ్చినా కేంద్రం స్పందించడంలేదన్నారు. రేవంత్రెడ్డి.. కాంగ్రెస్, భాజపాల ఉమ్మడి ముఖ్యమంత్రి లెక్క ఉన్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నందినగర్లోని నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. “రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ అని స్వయంగా ప్రధాని మోదీనే ఆరోపించారు. కానీ విచారణ జరపరు. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేస్తుంటే భాజపా ఎందుకు అడ్డుకోవడం లేదు? హెచ్సీయూ భూముల వేలం వెనుక భారీ కుంభకోణం ఉంది. దీని వెనుక ఒక భాజపా ఎంపీ కూడా ఉన్నారు. వివరాలన్నీ త్వరలో బయటపెడతా” అని పేర్కొన్నారు.
మేము సారథ్యం వహించలేదు
“హెచ్సీయూ భూముల విషయంలో విద్యార్థులు, ప్రజాసంఘాలు ఆందోళన చేపట్టాయి. వాటికి మేము సారథ్యం వహించలేదు. మద్దతుగా నిలిచాం. ఇక్కడి విద్యార్థులపై పోలీస్ కేసులను వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. అయితే ఇప్పటివరకూ జరిగిన నష్టానికి బాధ్యత ప్రభుత్వానిదే. వన్యప్రాణుల మరణాలకు కారణమైన వారిపై కేసులు నమోదు చేయాలి. మొత్తం కంచ గచ్చిబౌలి భూముల వేలాన్ని రద్దు చేసేవరకూ మా పోరాటం కొనసాగుతుంది” అని కేటీఆర్ స్పష్టంచేశారు.
అచ్ఛేదిన్ అంటే ఇదేనా?
“ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు తగ్గుతుంటే.. మన కేంద్ర ప్రభుత్వం మాత్రమే గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచింది. దీంతో సామాన్యుడి జీవితం అతలాకుతలమవుతోంది. మోదీ చెప్పిన అచ్చే దిన్ అంటే ఇదేనా? అమెరికా సుంకాలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలతో ప్రజల ఆర్థిక సంపద కరిగిపోతున్నా పట్టించుకోవడం లేదు. ఐటీ ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాలు తెలంగాణకు తీవ్రంగా నష్టం చేకూర్చబోతున్నాయి” అని పేర్కొన్నారు.
పార్టీ చరిత్రలో అతిపెద్ద సభ
“రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చాక.. గోదావరి జలాల్లో మన వాటా వృథాగా పోతోంది. మా హయాంలో 36 శాతం సాగర్ జలాలను వాడుకుంటే.. కాంగ్రెస్ పార్టీ 24 శాతం కూడా వాడుకోలేదు. అందుకే ఈరోజు గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో సన్నబియ్యంతో భోజనాన్ని మేము ఎప్పుడో ప్రవేశపెట్టాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడేదో కొత్తగా చేసినట్లు గొప్పలు చెప్పుకుంటోంది. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న సభ.. మా పార్టీ చరిత్రలో అతి పెద్దది అవుతుంది. తెలుగునాట విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు తెదేపా, భారాస మాత్రమే. అందుకే ఏడాది పాటు సిల్వర్జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం\" అని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు.