Category : అంతర్జాతీయ | Sub Category : వార్తలు Posted on 2025-04-09 10:16:15
తెలుగు వెబ్ మీడియా న్యూస్: ఈ ఏడాది హజ్ యాత్ర దగ్గరపడుతుండటంతో సౌదీ అరేబియా.. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా ఇతర 11 దేశాల పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఉమ్రా, బిజినెస్, కుటుంబ సందర్శన తదితర కేటగిరీ వీసాలపై ఈ నిషేధం ఉంటుంది. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్రకు వస్తున్న వారిని నిలువరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌదీ అధికారులు తెలిపారు. గత ఏడాది హజ్ సమయంలో రిజిస్టర్ కాని యాత్రికుల వల్ల తొక్కిసలాట చోటుచేసుకుంది. గత ఏడాది హజ్ యాత్రలో పాల్గొన్నవారిలో 12 వందలకు పైగా యాత్రికులు వివిధ కారణాలతో మృతి చెందారు.
రిజిస్టర్ కాని యాత్రికుల వల్ల హజ్ లో తీవ్రమైన రద్దీ ఏర్పడిందని సౌదీ అధికారులు భావిస్తున్నారు. ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు సౌదీ పాలకుడు ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వివిధ వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేశారు. వీసా నిబంధనలను కూడా మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. అయితే దౌత్య, నివాస ఆవాసితులు, హజ్ యాత్ర కోసం ప్రత్యేకంగా నమోదైన యాత్రికులకు ఈ నిషేధం వర్తించదు.
మరోవైపు సౌదీలో అక్రమంగా నివసిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపింది అక్కడి ప్రభుత్వం. కేవలం వారం రోజుల వ్యవధిలో ఏకంగా 18,407 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసింది. వీరంతా రెసిడెన్సీ, లేబర్, సరిహద్దు భద్రతా నియమాలను ఉల్లంఘించినట్లు సౌదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. మార్చి 27 నుండి ఏప్రిల్ 2 వరకు పలు ప్రభుత్వ ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో వీరిని అదుపులోకి తీసుకున్నారు.