Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-09 10:04:26
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- వైసీపీ అధినేత జగన్ రాప్తాడు టూర్ రాజకీయ దుమారం రేపుతోంది. హత్యకు గురైన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మాజీ సీఎం జగన్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. జనం తాకిడితో హెలికాప్టర్ విండ్ షీల్డ్ డ్యామేజ్ అవడంతో జగన్ రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్లారు. దీంతో రచ్చ రాజుకుంది. ఇది భద్రతా వైఫల్యమని, జగన్ పర్యటనకు పోలీసులు సరైన సెక్యూరిటీ కల్పించలేదంటూ వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. వైసీపీ వాదనకు టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. జగన్‌కు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ భద్రత కల్పించామని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.
కాగా.. వైసీపీ వ్యాఖ్యలపై స్పందించిన సత్యసాయి జిల్లా SP రత్న జగన్ టూర్‌కు భారీ భద్రత కల్పించామన్నారు.. మాజీ సీఎమ్‌ను వీవీఐపీగా ట్రీట్ చేసి బందోబస్తు ఏర్పాటుచేశామన్నారు. పోలీస్ యూనిఫాం తాము కష్టపడి సాధించామని.. తాము తప్పు చేస్తే రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చన్నారు. మేం ఎవరికీ అనుకూలంగా పని చేయలేదంటూ ఎస్పీ రత్న పేర్కొన్నారు.
ఇక గతంలో కూడా జగన్ భద్రత విషయంలో వివాదాలు రాజుకున్నాయి. కొద్ది నెలల క్రితం.. గుంటూరులోని మిర్చియార్డుకు జగన్ వెళ్లారు గిట్టుబాటు రేటు లేక మిర్చి రైతులు ఆందోళన చెందుతుంటే, వాళ్లకు సంఘీభావం ప్రకటించడానికి మాజీ సీఎం వెళ్లారు. ఆ సందర్భంగా జగన్‌కు పోలీసులు సరైన భద్రత కల్పించలేదని, కాన్వాయ్‌లో డొక్కు వాహనాలను ఏర్పాటుచేశారని వైసీపీ నేతలు విమర్శించారు. ఇక అంతకుముందు తాడేపల్లిలోని జగన్ నివాసం దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఉండే గార్డెన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పేశారు. వైఎస్సార్‌సీపీ మాత్రం భద్రతాలోపం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని అప్పట్లో ఆరోపించింది. ఆ తర్వాత జగన్‌కు పటిష్టమైన భద్రత కల్పించాలంటూ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వినతిపత్రం ఇచ్చారు. లేటెస్టుగా రాప్తాడు రచ్చతో జగన్ సెక్యూరిటీ టాపిక్.. ఏపీలో మరోసారి కాక రేపుతోంది.